Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

హబక్కూకు 2 - పవిత్ర బైబిల్

1 నేనొక కాపలాదారునిగా నిలబడి గమనిస్తాను. యెహోవా నాకు ఏమి చెపుతాడో వినటానికి నేను వేచి ఉంటాను. ఆయన నా ప్రశ్నలకు ఎలా సనాధానమిస్తాడో నేను వేచివుండి తెలుసుకుంటాను.


హబక్కూకునకు దేవుడు సమాధానమివ్వటం

2 యెహోవా నాకు సమాధానమిచ్చాడు: “నేను నీకు చూపించేవాటిని వ్రాయి. ప్రజలు సులభంగా చదవగలిగే రీతిలో దానిని ఒక పలకమీద స్పష్టంగా వ్రాయి.

3 ఈ వర్తమానం భవిష్యత్తులో ఒక ప్రత్యేక సమయం గురించినది. ఈ వర్తమానం పరిసమాప్తిని గురించినది. అది నిజమవుతుంది! ఆ సమయం ఎన్నడూ రానట్టుగా కన్పించవచ్చు. కాని ఓపికతో దానికొరకు వేచివుండు. ఆ సమయం వస్తుంది. అది ఆలస్యం కాదు.

4 దీనిని విన నిరాకరించే వారికి ఈ వర్తమానం సహాయపడదు. కాని మంచివాడు ఈ వర్తమానాన్ని నమ్ముతాడు. తన విశ్వాసం కారణంగా, ఆ మంచి వ్యక్తి దీనిని నమ్ముతాడు.”

5 దేవుడు చెప్పాడు: “ద్రాక్షమద్యం మనిషిని మోసం చేయగలదు. అదే మాదిరి ఒక బలవంతుని గర్వం అతనిని అవివేకునిగా చేస్తుంది. అతనికి శాంతి ఉండదు. అతడు మృత్యువువలె ఉంటాడు. అతడు ఇంకా, ఇంకా కోరుతూనే ఉంటాడు. మృత్యువువలె అతనికి తృప్తి అంటూ ఉండదు. అతడు ఇతర దేశాలను ఓడించటం కొనసాగిస్తూనే ఉంటాడు. ఆ ప్రజలను చెరపట్టటం కొనసాగిస్తూ ఉంటాడు.

6 కాని అతి త్వరలోనే ఆ ప్రజలంతా అతనిని చూచి నవ్వుతారు. తన ఓటమిని గురించి వారు కథలు చెపుతారు. వారు నవ్వి, ‘అది మిక్కిలి హేయమైనది! ఆ వ్యక్తి అనేక వస్తువులు దొంగిలించాడు. తనవి కానివాటిని తన వశం చేసుకున్నాడు. అతడు ధనాన్ని విస్తారంగా తీసుకున్నాడు. ఆ వ్యక్తికి అది అతి శ్రమకారకమైన పని’ అని అంటారు.

7 “నీవు (బలవంతుడు) ప్రజలవద్ద డబ్బు తీసుకున్నావు. ఒక రోజు ఆ ప్రజలు మేల్కొని, జరుగుతున్నదానిని గుర్తిస్తారు. వారు నీకు ఎదురు తిరుగుతారు. అప్పుడు వారే నీనుండి వస్తువులు తీసుకొంటారు. నీవు చాలా భయపడతావు.

8 నీవు అనేక దేశాలనుండి వస్తువులు దొంగిలించావు. కావున ఆ ప్రజలు నీ నుండి చాలా తీసుకుంటారు. నీవు అనేకమందిని చంపివేశావు. నీవు దేశాలను, నగరాలను నాశనం చేశావు. నీవక్కడ ప్రజలందరినీ చంపివేశావు.

9 “అవును, అన్యాయం చేసి ధనవంతుడైన వానికి మిక్కిలి శ్రమ. సురక్షిత ప్రదేశంలో నివసించటానికి అతడు ఆ పనులు చేశాడు. ఇతరులు తనను దోచుకోవటాన్ని తను ఆపగలనని అతడు అనుకొంటున్నాడు. కాని అతనికి కీడు వాటిల్లుతుంది.

10 నీవు (బలవంతుడు) అనేక మందిని నాశనం చేయటానికి వ్యూహాలు పన్నావు. ఇది నీ స్వంత ప్రజలనే అవమానానికి గురిచేసింది. నీవు ప్రాణాన్ని కోల్పోతావు.

11 గోడరాళ్ళు నీకు వ్యతిరేకంగా అరుస్తాయి. నీ స్వంత ఇంటి వాసాలు సహితం నీవు తప్పు చేశావని ఒప్పుకుంటాయి.

12 “అన్యాయం చేసి, నరహత్య చేసి నగరం నిర్మించిన నాయకునికి మిక్కిలి కీడు.

13 అటువంటి జనులు నిర్మింప తలపెట్టిన వాటన్నిటినీ అగ్నిచే కాల్చివేయటానికి సర్వశక్తిమంతుడైన యెహోవా నిర్ణయించాడు. వారు చేసిన పనంతా వృథా.

14 అప్పుడు ప్రతిచోట ప్రజలు యెహోవా యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు. సముద్రంలోకి నీరు వ్యాపించునట్లు ఈ వార్త వ్యాపిస్తుంది.

15 తను కోపం చెంది, ఇతరులను బాధించే వ్యక్తికి మిక్కిలి శ్రమ. ఆ వ్యక్తి కోపంలో ఇతరులను నేలకు పడగొడతాడు. అతడు వారిని వస్త్రవిహీనులుగాను, తాగినవారిగాను చూస్తాడు.

16 “కాని అతడు యెహోవా కోపాన్ని తెలుసుకుంటాడు. ఆకోపం యెహోవా కుడి చేతిలో విషపు గిన్నెలా ఉంటుంది. అతడు ఆ కోపాన్ని రుచిచూచి, తాగిన వానిలా నేలమీద పడతాడు. “దుష్టపాలకుడా, నీవు ఆ గిన్నెనుండి తాగుతావు. నీవు పొందేది అవమానం; గౌరవం కాదు.

17 నీవు లెబానోనులో ఎంతోమందిని బాధించావు. అక్కడ నీవు ఎన్నో పశువులను దొంగిలించావు. కావున, చనిపోయిన ప్రజల కారణంగాను, నీవా దేశానికి చేసిన చెడుపనుల వల్లను నీవు భయపడతావు. నీవా నగరాలకు, వాటిలో నివసించే ప్రజలకు చేసిన పనులనుబట్టి నీవు భయపడతావు”


విగ్రహాలను గూర్చిన వర్తమానం

18 అతని బూటకపు దేవుడు అతనికి సహాయం చేయడు. ఎందుకనగా అది ఒకానొకడు లోహవు తొడుగు వేసి చేసిన బొమ్మ. అది కేవలం విగ్రహం. కావున దానిని చేసినవాడు అది సహాయం చేస్తుందని ఆశించలేడు. ఆ విగ్రహం కనీసం మాట్లాడలేదు.

19 ఒక కొయ్య విగ్రహముతో “నిలబడు” అని చెప్పేవానికి మిక్కిలి వేదన! మాట్లాడలేని ఒక రాతితో, “మేలుకో” అని చెప్పేవానికి బాధ తప్పదు. ఆ వస్తువులు అతనికి సహాయపడలేవు. ఒక విగ్రహం బంగారంతో గాని, వెండితో గాని తొడుగు వేయబడవచ్చు. కాని ఆ విగ్రహంలో ప్రాణం లేదు.

20 కాని యెహోవా విషయం వేరు! యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. కావున ఈ భూమి అంతా నిశ్శబ్దంగా వుండి, యెహోవాముందు గౌరవ భావంతో మెలగాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan