Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆదికాండము 48 - పవిత్ర బైబిల్


మనష్షే, ఎఫ్రాయిములకు ఆశీర్వాదాలు

1 కొంత కాలం తర్వాత, తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలిసింది. కనుక మనష్షే, ఎఫ్రాయిము అనే తన యిద్దరు కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.

2 యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడకమీద కూర్చున్నాడు.

3 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, “కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు.

4 దేవుడు నాతో చెప్పాడు: ‘నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటారు.’

5 ఇప్పుడు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. ఎఫ్రాయిము, మనష్షే అనే నీ యిద్దరు కుమారులు నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యోనులు నాకెలాగో వారు కూడ నాకు అంతే.

6 కనుక ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి కూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే, వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు.

7 పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా (ఎఫ్రాతా బెత్లెహేము) వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేశాను.”

8 అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.

9 యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు. “నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.

10 ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు. అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు.

11 అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో.

12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.

13 ఎఫ్రాయిమును తన కుడి ప్రక్కను, మనష్షేను తన ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు).

14 కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు.

15 మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు: “నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు. ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు.

16 ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత. ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది. మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి. వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”

17 తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం కలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిము తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు.

18 యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు.

19 అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా, మనష్షే జ్యేష్ఠుడు. అతడు గొప్పవాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్పవాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.”

20 అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు. “ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు నీ నామాన్ని ఉపయోగిస్తారు. ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు ‘దేవుడు ఎఫ్రాయిము మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు’ అని అతడు చెప్పాడు.” ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు.

21 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు.

22 నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan