ఆదికాండము 35 - పవిత్ర బైబిల్బేతేలులో యాకోబు 1 “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు. 2 కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి. 3 మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.” 4 కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేశారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేశారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం క్రింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు. 5 యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి, యాకోబును వెంబడించలేదు. 6 కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది. 7 అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు. 8 రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం క్రింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూత్ అని వారు పేరు పెట్టారు. యాకోబు క్రొత్త పేరు 9 పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయి, యాకోబును యిలా ఆశీర్వదించాడు. 10 “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. నీ క్రొత్త పేరు ‘ఇశ్రాయేలు’ అని ఉంటుంది.” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. 11 అతనితో దేవుడన్నాడు: “నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు. 12 అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.” 13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. 14-15 ఈ స్థలంలో ఒక స్మారక శిల యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేశాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు గనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. రాహేలు ప్రసవిస్తూ చనిపోవుట 16 యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్లెహేం) చేరుతారనగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది. 17 అయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడుతోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు పనిమనిషి ఇది చూసి, “రాహేలూ, భయపడకు. నీవు మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది. 18 కుమారుని కంటుండగా రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. 19 ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది (ఎఫ్రాతా అంటే బెత్లెహేం). 20 రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది. 21 అప్పుడు ఇశ్రాయేలు (యాకోబు) తన ప్రయాణం కొనసాగించాడు. ఏదెరు శిఖరానికి కొద్దిగా దక్షిణంగా అతడు శిబిరం వేశాడు. 22 ఇశ్రాయేలు అక్కడ కొన్నాళ్లపాటు ఉండిపోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు దాసి బిల్హాతో రూబేను శయనించాడు. ఇశ్రాయేలు ఇది విని చాలా కోపగించుకొన్నాడు. యాకోబుకు (ఇశ్రాయేలుకు) 12 మంది కుమారులు. ఇశ్రాయేలు (యాకోబు) కుటుంబం 23 అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును. 24 అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను. 25 రాహేలు పనిమనిషి బిల్హా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాను, నఫ్తాలి. 26 లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు. 27 కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది. 28 ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. 29 ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని తండ్రి సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International