Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఎజ్రా 1 - పవిత్ర బైబిల్


యూదుల చెర విముక్తికి కోరెషు సహాయం

1 పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం, యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:

2 “పారశీక రాజు కోరెషు తెలియజేసేది ఏమంటే: పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకంలోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచుకున్నాడు.

3 యెరూషలేములో వున్న ఇశ్రాయేలీయుల దేవుడే ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మనుష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ వలసిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. యూదా దేశంలోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి

4 ఇశ్రాయేలీయుల్లో మిగిలివున్నవాళ్లు ఎక్కడైనా ఉన్నట్లయితే, వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశేషులకు వెండిది బంగారాలు, ఆవులు, వగైరాలు ఇవ్వాలి. యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి కానుకలు ఇవ్వాలి.”

5 యూదా, బెన్యామీను వంశాలకు చెందిన కుటుంబాల పెద్దలు యెరూషలేముకు పోయేందుకు సన్నద్ధ మయ్యారు. వాళ్లు యెరూషలోములో దేవాలయ నిర్మాణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేముకు పోయేందుకు సంసిద్ధుడయ్యాడు.

6 వాళ్ల ఇరుగుపొరుగు వారు వాళ్లకి అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు పొరుగువారు వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చారు.

7 పూర్వం నెబుకద్నెజరు యెరూషలేమునందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్ధపు దేవతల ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు మహారాజు బయటికి తీయించాడు.

8 పారశీక రాజైన కోరెషు ఆ వస్తువులను బయటికి తీసుకురమ్మని తన ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు మిత్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి తీయించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు అప్పగించాడు.

9 మిత్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల జాబితా యిది: బంగారు గిన్నెలు 30, వెండి గిన్నెలు 1,000, చాకులు, పెనాలు 29,

10 బంగారు పాత్రలు 30, బంగారు పాత్రల వంటివే వెండి పాత్రలు 410, ఇతర పాత్రలు 1,000.

11 వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, షేష్బజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో యెరూషలేముకు తీసుకువెళ్లాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan