Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 9 - పవిత్ర బైబిల్


దేవుని సందేశకులు యెరూషలేమును శిక్షించుట

1 పిమ్మట దేవుడు నగరాన్ని శిక్షించటానికి నియమితులైన నాయకులను పిలిచాడు. ప్రతి నాయకుడూ తన చేతిలో ఒక విధ్వంసకర ఆయుధం కలిగి ఉన్నాడు.

2 పై ద్వారం నుంచి ఆరుగురు మనుష్యులు బాటవెంట నడచి రావటం చూశాను. ఈ ద్వారం ఉత్తర దిశన ఉంది. ప్రతి ఒక్కడూ తన చేతిలో ఒక మారణాయుధాన్ని కలిగియున్నాడు. వారిలో ఒకడు నార బట్టలు ధరించాడు. అతని నడుముకు లేఖకుని కలం, సిరాబుడ్డి వేలాడకట్టుకున్నాడు. ఈ మనుష్యులు ఆలయంలో కంచు పీఠం వద్దకు వెళ్లి, అక్కడ నిలబడ్డారు.

3 అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి అతను ఎక్కడకు వెళ్లాడో అక్కడకి వచ్చింది. ఆ తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు పిలిచింది.

4 పిమ్మట యెహోవా (మహిమ) అతనితో, “యెరూషలేము నగరం గుండా వెళ్లు. ఈ నగరంలో ప్రజలు చేస్తున్న భయంకరమైన పనులన్నిటికీ కలత చెంది, విచారిస్తున్న వారి ఒక్కొక్కరి నుదుటి మీద ఒక గుర్తు పెట్టు” అని చెప్పాడు.

5-6 మళ్లీ దేవుడు ఇతర ఐదుగురు మనుష్యులతో, “మీరు ఆ మొదటి వ్యక్తిని అనుసరించి వెళ్లవలసిందిగా మిమ్ముల్ని కోరుతున్నాను. నుదుటి మీద గుర్తులేని ప్రతివానిని మీరు చంపివేయండి. వారు పెద్దలేగాని, పిన్నలేగాని, యువతులేగాని, పిల్లలేగాని, తల్లులేగాని ఎవరైనా లెక్కచేయవద్దు. మీ ఆయుధాన్ని వినియోగించి నుదుటిపై గుర్తులేని ప్రతివానిని చంపివేయండి. ఏ మాత్రం దయాదాక్షిణ్యం చూపవద్దు. ఎవ్వరిపట్లా జాలిపడవద్దు! ఈ నా ఆలయం వద్దనే మొదలు పెట్టండి” అని చెప్పాడు. ఆలయం ముందు ఉన్న పెద్దలతోనే వారు మొదలు పెట్టారు.

7 ఆ మనుష్యులతో దేవుడు ఇలా చెప్పాడు, “ఈ స్థలాన్ని అపవిత్రం చేయండి. శవాలతో ఈ ఆవరణాన్ని నింపివేయండి! ఇప్పుడు వెళ్లండి!” కావున వారు వెళ్లి నగర ప్రజలను చంపివేశారు.

8 ఆ మనుష్యులు ప్రజలను చంపటానికి వెళ్లగా, నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి ఆనించి నమస్కరించి, “నా ప్రభువైన ఓ యెహోవా, యెరూషలేముపై నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు ఇశ్రాయేలులో మిగిలి ఉన్న వారిని చంపివేయటం లేదు కదా!” అని అన్నాను.

9 అది విన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా వంశాల వారు అనేక ఘోరపాపాలు చేశారు. ఈ దేశంలో ప్రజలు ఎక్కడ బడితే అక్కడ హత్య చేయబడుతున్నారు. ఈ నగరం నేరాలతో నిండిపోయింది. ఎందువల్లనంటే ప్రజలు, ‘యెహోవా ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయాడు కనుక మనం చేసే పనులను ఆయన చూడలేడు’ అని అనుకొంటున్నారు.

10 కాని నేను ఏ మాత్రం కనికరం చూపను. ఈ ప్రజలు పట్ల విచారించను. వారు దాన్ని వారి మీదకే తెచ్చుకొన్నారు. నేను కేవలం వారికి అర్హమైన శిక్ష విధిస్తున్నాను!”

11 పిమ్మట నారబట్టలు ధరించి కలం, సిరాబుడ్డి పట్టుకున్న వ్యక్తి వచ్చి, “మీ ఆజ్ఞ ప్రకారం నేను అంతా చేశాను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan