Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 6 - పవిత్ర బైబిల్


ఇశ్రాయేలుకు విరోధంగా ప్రవచనాలు

1 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినిపించింది.

2 ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలవైపు తిరిగి, నా తరపున వాటికి వ్యతిరేకంగా మాట్లాడు.

3 ఆ పర్వతాలకు ఈ విషయాలు తెలియజెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతములారా, నా ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! నా ప్రభువైన యెహోవా కొండలకు, పర్వతాలకు, కనుమలకు, లోయలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి! (దేవుడనగు) నేను మీపై యుద్ధానికి శత్రువును రప్పిస్తున్నాను. మీ ఉన్నత స్థలాలు. నేనే నాశనం చేస్తాను

4 మీ బలిపీఠాలు ముక్కలు చేయబడతాయి! మీ ధూప వేదికలు నాశనం చేయబడతాయి. మీ హేయమైన విగ్రహాలముందే మీ శవాలను పడవేస్తాను.

5 ఇశ్రాయేలు ప్రజల శవాలను అసహ్యమైన విగ్రహాల ముందు పడవేస్తాను. మీ ఎముకలను మీ పీఠాల చుట్టూ వెదజల్లుతాను.

6 మీ ప్రజలెక్కడ వుంటే అక్కడ వాళ్ళు నాశనం చేయబడతారు. వారి నగరాలు రాళ్లగుట్టల్లా మారిపోతాయి. వారి ఉన్నత స్థలాలు నాశనం చేయబడతాయి. ఎందుకంటే, ఆ పూజా స్థలాలు మరెన్నడూ వినియోగింపబడకుండా వుండేటందుకు. ఆ బలి పీఠాలు నాశనం చేయబడతాయి. ప్రజలు మరెన్నడూ ఆ రోత విగ్రహాలను ఆరాధించరు. ఆ ధూప పీఠాలు ధ్వంసం చేయబడతాయి. మీరు చేసిన వస్తువులన్ని సర్వనాశనం చేయబడతాయి!

7 మీ ప్రజలు చంపబడతారు. అప్పుడు నేనే ప్రభువు (యెహోవా) నని మీరు తెలుసుకుంటారు!’”

8 దేవుడు ఇలా చెప్పాడు: “కాని మీలో చాలా కొద్ది మంది తప్పించుకునేలా నేను చేస్తాను. వారు అన్య దేశాలలో స్వల్పకాలం పాటు నివసిస్తారు. వారిని నేను చెల్లా చెదురుచేసి, ఇతర దేశాలలో నివసించేలా ఒత్తిడి చేస్తాను.

9 అలా మిగిలిన వారు బందీ చేయబడతారు. వారు అన్యదేశాలలో నివసించేలా తరిమివేయబడతారు. కాని, అలా మిగిలిన వారు నన్ను తలచుకొంటారు. నేను వారి గుండెలు బద్దలయ్యేలా చేశాను. వారు చేసిన చెడు కార్యాలకు వారిని వారే అసహ్యించుకుంటారు. గతంలో వారు నాకు విముఖులై, నన్ను వదిలిపెట్టారు. హేయమైన వారి విగ్రహాల వెంట వారు వెళ్ళారు. తన భర్తను వదిలి, పరాయి పురుషుని వెంటబడిన స్త్రీవలె వారున్నారు. వారెన్నో భయంకరమైన పనులు చేశారు.

10 చివరికి, నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. నేనేదైనా చేస్తానంటే, అది చేసి తీరుతానని కూడా తెలుసుకొంటారు! వారికి జరిగిన కీడంతా నేనే జరిపించినట్లు వారు తెలుసుకొంటారు.”

11 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “నీ చేతులు చరిచి, నీ పాదాలను దట్టించుము. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరమైన చెడ్డ పనులన్నిటినీ విమర్శిస్తూ మాట్లాడు. వారు వ్యాధుల వల్ల, ఆకలిచేత చనిపోతారని వారిని హెచ్చరించు. వారు యుద్ధంలో చనిపోతారని తెలియజేయుము.

12 దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది.

13 అప్పుడు మాత్రమే నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీ అపవిత్రమైన మీ విగ్రహాలముందు, వాటి బలిపీఠాల చుట్టూ పడిన మీ శవాలను చూచినప్పుడు మీరిది తెలుసుకుంటారు. ఆ శవాలు మీ ఆరాధనా స్థలాలున్న ప్రతిచోట, ప్రతి కొండ, పర్వతం మీద, ప్రతి పచ్చని చెట్టు, ఆకులున్న ప్రతి సింధూర వృక్షం క్రింద పడి వుంటాయి. ఆ స్థలాలన్నిటిలో మీరు మీ బలులు సమర్పించారు. అవి మీ హేయమైన విగ్రహాలకు సుగంధ పరిమళాలు.

14 కాని మీ మీదికి నా చెయ్యెత్తి, మిమ్ముల్ని నేను శిక్షించాను! నేను మీ దేశాన్ని నాశనం చేశాను. అది దిబ్లాతు ఎడారి కంటె ఎక్కువగా శూన్య ప్రదేశమయ్యింది. ఇప్పుడు మీ ప్రజలు నివసించే ప్రతి చోటా నేనే యెహోవానని తెలుసుకొంటారు!”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan