యెహెజ్కేలు 30 - పవిత్ర బైబిల్బబులోను సైన్యం ఈజిప్టును ఎదుర్కొంటుంది 1 మరొకసారి యెహోవా మాట నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, నా తరపున మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “‘నీవు దుఃఖపడి, “భయంకరమైన రోజు దరిచేరుతున్నది” అని ప్రకటించుము. 3 ఆ రోజు దగ్గరలో ఉంది! అవును. యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గర పడుతున్నది. అది మేఘాల రోజు. అది రాజ్యాలపై తీర్పు ఇచ్చే సమయం! 4 ఈజిప్టు మీదకి ఒక కత్తి వస్తుంది! ఈజిప్టు పతనమయ్యే సమయాన ఇథియోపియ (కూషు) ప్రజలు భయంతో చెదరిపొతారు. ఈజిప్టు ప్రజలను బబులోను సైన్యం బందీలుగా పట్టుకుపోతుంది. ఈజిప్టు పునాదులు కదిలిపోతాయి! 5 “‘ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ (కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన దేశము) ప్రజలు-అందరూ నాశనం చేయబడతారు! 6 “‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అవును. ఈజిప్టును బలపర్చిన వారంతా పడిపోతారు! దాని బలగర్వం తగ్గి పోతుంది. మిగ్దోలు నుండి ఆశ్వన్ (సెవేనే) వరకు గల ఈజిప్టు ప్రజలంతా చంపబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 7 నాశనం చేయబడిన దేశాలలో ఈజిప్టు కూడా కలిసిపోతుంది. శూన్యంగా మిగిలిన రాజ్యాలలో ఈజిప్టు ఒకటి అవుతుంది. 8 ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను. దానితో దాని సహాయకులు నాశనమై పోతారు. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. 9 “‘ఆ సమయాన నేను దూతలను పంపుతాను. వారు ఓడలలో పయనించి ఇథియోపియ (కూషు)కు దుర్వార్త తీసుకొని వెళతారు. ఇథియోపియ ఇప్పుడు క్షేమంగా ఉన్నాననుకుంటూ ఉంది. కాని ఈజిప్టు శిక్షించ బడినప్పుడు ఇథియోపియ ప్రజలు భయంతో కంపించిపోతారు. ఆ సమయం వస్తూ ఉంది!’” 10 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “బబులోను రాజైన నెబుకద్నెజరును నేను వినియోగించి ఈజిప్టు ప్రజలను నాశనం చేస్తాను. 11 నెబుకద్నెజరు, అతని మనుష్యులు జాతులన్నిటిలోనూ అతి భయంకరులు. ఈజిప్టును నాశనం చేయటానికి వారిని తీసుకొనివస్తాను. ఈజిప్టు మీద వారు తమ కత్తులు దూస్తారు. వారు దేశాన్ని శవాలతో నింపివేస్తారు. 12 నైలునది ఎండిపోయేలా నేను చేస్తాను. అలా ఎండిన భూభూగాన్ని దుష్ట జనులకు అమ్మి వేస్తాను. ఆ భూమిని నిర్మానుష్యం చేయటానికి నేను అన్యజనులను వినియోగిస్తాను. యెహోవానైన నేను ఈ విషయాలు చెపుతున్నాను!” ఈజిప్టు విగ్రహాలు నాశనం చేయబడుతాయి 13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టులో ఉన్న విగ్రహాలను కూడా నేను నాశనం చేస్తాను. మెంఫిస్ (నొపు)లో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను. ఈజిప్టులో ఇక ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు. ఈజిప్టు రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను. 14 పత్రోసును శూన్య రాజ్యంగా మార్చివేస్తాను. సోయనులో అగ్ని రగుల్చుతాను. ‘నో’ నగరాన్ని శిక్షిస్తాను. 15 ఈజిప్టుకు కోటవలె అండగా నిల్చిన సీను మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను! ‘నో’ నగర వాసులను నేను నాశనం చేస్తాను. 16 ఈజిప్టులో నేను అగ్ని ముట్టిస్తాను. సీను అనబడే ప్రాంతం భయానికి గురియవుతుంది. ‘నో’ నగరంలోకి సైనికులు విరుచుకుపడ్తారు. శత్రువులు దాన్ని పగటిపూట ఎదుర్కొంటారు. 17 ఓను, పిబేసెతు పట్టణాల యువకులు యుద్ధంలో చనిపోతారు. స్త్రీలు బందీలుగా పట్టుకుపోబడతారు. 18 ఈజిప్టు ఆధిపత్యాన్ని (కాడిని) తహపనేసులో నేను విరిచినప్పుడు అక్కడ అంధకారం ఏర్పడుతుంది. ఈజిప్టు యొక్క బలగర్వం అంతమవుతుంది! ఈజిప్టును ఒక మేఘం ఆవరిస్తుంది. ఆమె కుమార్తెలు చెరపట్టబడి తీసుకుపోబడతారు. 19 ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!” ఈజిప్టు శాశ్వతంగా బలహీనమవుతుంది 20 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్) ఏడవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరో చేతిని (శక్తిని) నేను విరిచివేశాను. ఆ చేతికి ఎవ్వరూ కట్టు కట్టలేరు. అది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి పట్టే బలాన్ని పుంజుకోలేదు.” 22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి కత్తి జారి క్రిందపడేలా చేస్తాను. 23 ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను. 24 బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు. 25 ఆ విధంగా బబులోను రాజు చేతులను బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చుతాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. “నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచుతాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురుతాడు. 26 నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమివేస్తాను. అప్పడు నేను యెహోవానని వారు తెలుసుకొంటారు.” |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International