Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 2 - పవిత్ర బైబిల్


యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడటం

1 ఆ స్వరం, “నరపుత్రుడా, లెమ్ము; నేను నీతో మాట్లాడదలిచాను” అని అన్నది.

2 ఇంతలో ఒకగాలి వచ్చి నన్ను నా పాదాలమీద నిలబెట్టింది. ఆ వ్యక్తి (దేవుడు) చెప్పేది నేను విన్నాను.

3 ఆయన ఇలా చెప్పాడు, “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడటానికి నిన్ను నేను పంపుతున్నాను. ఆ ప్రజలు అనేక సార్లు నాకు వ్యతిరేకులయ్యారు. వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు చేశారు. వారు నా పట్ల అనేకసార్లు పాపం చేశారు. ఈనాటికీ వారు నాపట్ల పాపం చేస్తూనే వున్నారు.

4 ఆ ప్రజలతో మాట్లాడటానికి నేను నిన్ను పంపుతున్నాను. కాని వారు చాలా మొండివారయ్యారు. వారు తలబిరుసు కలిగినవారు. అయినా, నీవు వారితో తప్పక మాట్లాడాలి. ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు’ అని నీవు అనాలి.

5 కాని ఆ ప్రజలు నీ మాట వినరు. వారు నా పట్ల పాపం చేయటం మానరు. ఎందువల్లనంటే వారు మిక్కిలిగా తిరుగబడే స్వభావం గలవారు. వారు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు! కాని నీవావిషయాలు చేప్పాలి. దానితో వారిమధ్య ఒక ప్రవక్త నివసిస్తున్నాడని వారు తెలుసుకుంటారు.

6 “ఓ నరపుత్రుడా, ఆ ప్రజలకు నీవు భయపడవద్దు, వారు చెప్పేవాటికి నీవు భయపడకు, వారు నీకు వ్యతిరేకులై, నీకు హాని చేయటం ఖాయం. వారు ముండ్లవంటి వారు. తేళ్లమధ్య నివసిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. కాని వారు చెప్పేవాటికి నీవు భయపడవద్దు. వారు తిరుగుబాటుదారులు. అయినా వారికి నీవు భయపడవద్దు.

7 నేను చేప్పే విషయాలు నీవు వారికి తప్పక తెలియజేయాలి. వారు నీ మాట వినరని నాకు తెలుసు. పైగా నా పట్ల పాపం చేయటం వారు మానరు. ఎందువల్లనంటే వారు తిరుగబడే స్వభావం గలవారు.

8 “ఓ నరపుత్రుడా, నేను నీకు చెప్పే విషయాలు శ్రద్ధగా విను. ఆ తిరుగుబాటుదారుల్లా నీవు నాకు వ్యతిరేకం కావద్దు. నీ నోరు తెరచి, నా మాటలు స్వీకరించు. తిరిగి వాటిని ప్రజలకు తెలియజెప్పు. ఈ మాటలను నీవు జీర్ణించుకో.”

9 తరువాత నేను (యెహెజ్కేలు) ఒక చేయి నా మీదికి రావటం చూశాను. ఆ చేతిలో వ్రాయబడిన గ్రంథపు చుట్ట ఉంది.

10 చుట్టబడిన ఆ కాగితాన్ని విడదీసి చూడగా దానిమీద రెండు వైపులా వ్రాసివుంది. అందులో రకరకాల విషాద గీతికలు, విషాద గాథలు, హెచ్చరికలు ఉన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan