Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహెజ్కేలు 13 - పవిత్ర బైబిల్


అబధ్ధ ప్రవక్తలకు విరోధంగా హెచ్చరికలు

1 మరొకసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు:

2 “నరపుత్రుడా, నీవు నా తరపున ఇశ్రాయేలు ప్రవక్తలతో మాట్లాడాలి. ఆ ప్రవక్తలు వాస్తవానికి నా తరపున మాట్లాడటం లేదు. ఆ ప్రవక్తలు తాము చెప్పదలచుకొన్న విషయాలే చెప్పుచున్నారు. కావున నీవు వారితో మాట్లాడవలెను. వారికి ఈ విషయాలు చెప్పు: ‘యెహోవా నుండి వచ్చిన వర్తమానం వినండి!

3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు. దుష్ట ప్రవక్తలగు మీకు కీడు మూడుతుంది. మీరు మీ ఆత్మల్నే అనుసరిస్తున్నారు. మీరు స్వప్న దర్శనాలలో చూసిన వాస్తవాలను ప్రజలకు చెప్పుటలేదు.

4 “‘ఓ ఇశ్రాయేలూ! నీ ప్రవక్తలు, పాడుబడిన ఇండ్లల్లో పరుగెత్తే గుంట నక్కలా వుంటారు.

5 బీటలు వారిన నగర గోడల వద్ద నీవు సైనికులను కాపలా వుంచలేదు. ఇశ్రాయేలు వంశాన్ని కాపాడటానికి నీవు గోడలను నిర్మించలేదు. కావున యెహోవాకు మిమ్మల్ని శిక్షించే రోజు వచ్చినప్పుడు, నీవు యుద్ధంలో పరాజయం పొందుతావు!

6 “‘దొంగ ప్రవక్తలు తమకు దర్శనాలు కలిగాయని అన్నారు. కొన్ని తంత్రాలు చేసి వారు చెప్పిన విషయాలు జరుగుతాయని అన్నారు. కాని వారు అబద్ధమాడారు. వారిని యెహోవాయే పంపినట్లు వారు చెప్పారు. అదికూడా అబద్ధమే. వారి అబద్ధాలు నిజమవ్వాలని వారింకా ఎదురు చూస్తూనే వున్నారు.

7 “‘దొంగ ప్రవక్తలారా, మీరు చూసిన దర్శనాలు నిజం కావు. మీరు తంత్రాలు జరిపి, అనేక విషయాలు జరుగుతాయని చెప్పారు. కాని మీరు చెప్పింది అబద్ధం! యెహోవా ఆ విషయాలు చెప్పాడని మీరు ప్రకటించారు. కాని నేను మీతో మాట్లాడలేదు.’”

8 కాపున ఇప్పుడు నా ప్రభువైన యెహోవా నిజంగా మాట్లాడతాడు! ఆయన చెప్పినదేమంటే, “మీరు అబద్ధమాడారు. సత్యదూరమైన దర్శనాలను మీరు చూశారు. కావున ఇప్పుడు నేను (దేవుడు) మీకు వ్యతిరేకినయ్యాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

9 యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “అబద్ధపు దర్శనాలను చూచి, అబద్ధాలు చెప్పిన ప్రవక్తలను నేను శిక్షిస్తాను. వారిని నా ప్రజల మధ్యనుండి తొలగిస్తాను. వారి వేర్లు ఇశ్రాయేలు వంశావళిలో ఉండవు. వారు మరెన్నటికీ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు మీ ప్రభువగు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు!

10 “ఆ బూటకపు ప్రవక్తలు పదే పదే నా ప్రజలకు అబద్ధాలు చెప్పారు. శాంతి విలసిల్లుతుందని ఆ ప్రవక్తలు చెప్పారు. కాని శాంతి లేదు. గోడలు కట్టుదిట్టం చేసి, ప్రజలు యుద్ధానికి సిద్ధపడవలసి ఉంది. అయితే వారు పగిలిన గోడలమీద పలుచని పూత మాత్రం పూస్తున్నారు. పగుళ్లకు బంకమట్టి వ్రాస్తున్నారు.

11 నేను వారి మీదికి తీవ్రమైన వడగండ్ల వాన (శత్రు సైన్యం) పంపుతానని నీవు వారికి చెప్పు. పెనుగాలి వీస్తుంది. తుఫాను వస్తుంది. అప్పుడు ఆ గోడ కూలిపోతుంది.

12 గోడ కూలినప్పుడు ప్రజలు ప్రవక్తలను, ‘మీరు గోడలకు పూసిన బంకమట్టి ఏమయ్యింది?’” అని అడుగుతారు.

13 నా ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను కోపంగా వున్నాను. మీ మీదికి నేనొక తుఫాను పంపుతాను. నేను కోపగించివున్నాను. మీ మీదికి జడివాన పంపుతాను. నేను కోపంగావున్నాను. ఆకాశాన్నుండి వడగండ్లు పడేలా చేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను!

14 గోడమీద మీరు పలుచనైన బంకమట్టి పులిమారు. కాని నేను మొత్తం గోడనే నాశనం చేస్తాను. దానిని కూలగొడతాను. ఆ గోడ మీ మీద పడుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.

15 గోడమీద, ఆ గోడకు పూత పూసిన వారిమీద నా కోపం చూపటం పూర్తిచేస్తాను. అప్పుడు, ‘గోడా లేదు, గోడకు పూతపూసే పని వాళ్ళూ లేరు’ అని నేనంటాను.

16 “ఈ విషయాలన్నీ ఇశ్రాయేలులో వున్న దొంగ ప్రవక్తలకు సంభవిస్తాయి. ఆ ప్రవక్తలు యెరూషలేము ప్రజలతో మాట్లాడుతూ, శాంతి నెలకొంటుందని అంటారు. కాని శాంతి లేదు.” ఈ విషయాలన్నీ నా ప్రభువైన యెహోవా చెప్పాడు.

17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలులో స్త్రీ ప్రవక్తల విషయం చూడు. ఈ ఆడ ప్రవక్తలు నా తరపున మాట్లాడరు. వారు చెప్పదలచుకొన్నవే వారు చెప్పుతారు. కావున నీవు నా పక్షాన వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి.

18 నా ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడు, ఓ స్త్రీలారా, మీకు కీడు జరుగుతుంది. ప్రజలు వారి చేతులమీద ధరించటానికి మీరు గుడ్డలతో కంకణాలు కుడతారు. ప్రజలకు కావలసిన రకరకాల తలముసుగులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అవన్నీ ప్రజల జీవితాలను కట్టుబాట్లలో వుంచే మహిమగల వస్తువులని మీరు చెబుతున్నారు. మీ బ్రతుకుదెరువు కోసం ప్రజలను మీ వలలలో వేసుకొంటున్నారు!

19 నేను ముఖ్యుడను కానని ప్రజలు నమ్మేలా వారిని మీరు మభ్యపెడుతున్నారు. గుప్పెడు గింజల కోసం, పట్టెడు అన్నం కోసం మీరీ పనులన్నీ చేస్తూ ప్రజలను నాకు వ్యతిరేకులుగా చేస్తున్నారు. నా ప్రజలకు మీరు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు కూడా అబద్ధాలు వినటానికే ఇష్టపడుతున్నారు. బ్రతక వలసిన ప్రజలను మీరు చంపుతున్నారు. చావవలసిన మనుష్యులను మీరు జీవించేలా చేస్తున్నారు.

20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు చెబుతున్నాడు, మీరు బట్టతో కంకణాలు కట్టి ప్రజలను చిక్కించుకుంటున్నారు. కాని నేనా ప్రజలను విడుదల చేస్తాను. ఆ కంకణాలు మీ చేతుల నుండి లాగి పారవేస్తాను. అప్పుడు ప్రజలు మీ నుండి విముక్తి పోందుతారు. పంజరంలో నుండి ఎగిరిపోయే పక్షుల్లా వారు వుంటారు!

21 నేను వారి ముసుగులను చించివేస్తాను. మీ దుష్టశక్తి నుండి నా ప్రజలను కాపాడతాను. మీ బోను నుండి ఆ ప్రజలు తప్పించుకుంటారు. నేనే యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.

22 “‘ప్రవక్తలైన మీరు అసత్యాలు చెబుతున్నారు. మీ అబద్ధాలు మంచి వ్యక్తులకు బాధ కలుగజేస్తాయి. మంచి ప్రజలను బాధించటం నాకు ఇష్టంలేని పని, దుష్ట జనాన్ని మీరు బలపర్చి, వారిని ప్రోత్సహిస్తారు. వారి నడవడికను మార్చుకోమని మీరు వారికి చెప్పరు. మీరు వారి ప్రాణాలను రక్షించటానికి ప్రయత్నించరు,

23 కావున ఇక మీదట మీరు పనికిరాని దర్శనాలను చూడరు. మీరిక ఎంతమాత్రం గారడీలు చేయరు. మీ శక్తుల నుండి నా ప్రజలను నేను రక్షిస్తాను. అప్పుడు మీరు నన్ను యెహోవా అని తెలుసుకొంటారు.’”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan