Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నిర్గమ 1 - పవిత్ర బైబిల్


ఈజిప్టులో యాకోబు కుటుంబం

1 యాకోబు (ఇశ్రాయేలు) తన కుమారులతో పాటు ఈజిప్టు వెళ్లాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఏవంటే:

2 రూబేను, షిమ్యోను, లేవి, యూదా,

3 ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,

4 దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతియొక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు.

5 యాకోబు సంతానం మొత్తం డెబ్బయి మంది. (12 మంది కుమారుల్లో మరొకడు యోసేపు. అతను అప్పటికే ఈజిప్టులో వున్నాడు.)

6 తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు.

7 అయితే, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఆ ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది.


ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు

8 అప్పుడు ఒక కొత్తరాజు ఈజిప్టును పాలించడం మొదలు పెట్టాడు. ఈ రాజుకు యోసేపు తెలియదు.

9 ఈ రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు జనాన్ని చూడండి. వాళ్లు చాలామంది ఉన్నారు! పైగా వాళ్లు మనకంటె చాలా బలంగా ఉన్నారు!

10 వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి. లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు. అల్లాంటప్పుడు వాళ్లు మనల్ని ఓడించి, మన దగ్గర్నుండి తప్పించుకొని పారిపోవచ్చు.”

11 ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసలపైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియమించారు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేసు పట్టణాలను కట్టించారు. (ధాన్యం మొదలైన వాటిని వాళ్లు ఈ పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు)

12 ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు ఈజిప్టు వాళ్లు వారిని బలవంతపెట్టారు. కాని పనిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే, అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలను చూస్తోంటే, ఈజిప్టు వాళ్లు మరింత ఎక్కువగా భయపడిపోయారు.

13 అందుచేత ఈజిప్టు వారు ఇశ్రాయేలు ప్రజల శరీర శ్రమను మునుపటికన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు.

14 ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టువారు. అడుసు తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాల బలవంత పెట్టారు. వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాల బలవంత పెట్టి ఒత్తిడి చేసారు.


దేవుడ్ని వెంబడించిన మంత్రసానులు

15 షిఫ్రా, పూయా అను ఇద్దరు మంత్రసానులుండే వారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయ పడేవారు. ఈజిప్టు రాజు ఈ మంత్రసానులను పిలిచి,

16 “ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి, కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి” అని చెప్పాడు.

17 ఆ మంత్రసానులు దైవ భక్తిగలవాళ్లు గనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగ పిల్లలందర్నీ వాళ్లు బ్రతకనిచ్చారు.

18 ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిచి, “మీరు ఎందుకిలా చేసారు? ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు.

19 “ఈజిప్టు స్త్రీలకంటె హీబ్రూ స్త్రీలకు చాల బలం ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేసారు.” అంటూ మంత్రసానులు ఫరోతో చెప్పారు.

20-21 ఆ మంత్రసానుల విషయమై దేవుడు సంతోషించాడు కనుక వాళ్లకూ వారి స్వంత కుటుంబాలు ఉండేటట్టు దేవుడు వారికి మేలు చేశాడు. హీబ్రూ ప్రజలు ఇంకా పిల్లల్ని కంటూనే ఉండేవారు. వాళ్లు చాలా బలవంతులయ్యారు.

22 కనుక ఫరో, “మగశిశువు పుట్టినప్పుడల్లా, మీరు వాడ్ని నైలు నదిలో పడవేయండి. కాని ఆడపిల్లల్ని అందరినీ బ్రతకనియ్యండి” అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan