Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రసంగి 5 - పవిత్ర బైబిల్


వాగ్దానం చేయుటలో జాగ్రత్తగా వుండండి

1 దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు.

2 దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి)

3 అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు, బుద్ధిహీనులు అతిగా వాగుతారు.

4 దేవునికి నీవేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నీవు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నీవాయనకు ఇవ్వు.

5 ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు.

6 అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు. నీవాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నీవు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు.

7 నీ పనికిమాలిన స్వప్నాలు, బింకాలు (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నీవు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.


ప్రతి అధికారిపైన మరొక అధికారి ఉంటాడు

8 ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు బలవంతముగా కఠిన పని చేయడం నీవు చూడవచ్చు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన అని, బీదల హక్కులకు ఇది విరుద్ధమని నీవు చూడగలుగుతావు. అయితే, నీవు యిందుకు ఆశ్చర్యపడబోకు! వాళ్లచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, మరో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపైనా పెత్తనం చలాయించి పనిచేయించే మరో పై అధికారి వుంటాడు.

9 రాజు కూడా బానిసే. అతని రాజ్యం అతనికి యజమాని.


ధనం సంతోషమును కొనలేదు

10 డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకు ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాడు తనికు ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే.

11 ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, దాన్ని ఖర్చు పెట్టడంలో తోడ్పడే “మిత్రులు” అంత ఎక్కువ మంది ఉంటారు. దానితో, వాస్తవంలో ఆ ధనికుడు పొందే లాభమేమీ ఉండదు. అతను తన సంపదని చూసుకుని మురిసిపోగలడు. అంత మాత్రమే.

12 రోజంతా చెమటోర్చి కష్టపడేవాడు యింటికి తిరిగి వచ్చి తక్కువగా తిన్నా లేక ఎక్కువగా తిన్నా నిశ్చింతగా నిద్రపోతాడు. శ్రమజీవికి తినేందుకు కొంచెమే వున్నా, ఎక్కువ వున్నా అతనికి అదేమంత ముఖ్యంకాదు. కాని, ధనికుడికి తన సంపద విషయంలో దిగులుతో నిద్రపట్టదు.

13 ఈ ప్రపంచంలో చాలా విచారకరమైన విషయం ఒకటి నేను గమనించాను. ఒకడు భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేస్తాడు.

14 తర్వాత ఏదో విపత్తు వచ్చి, తన ఆస్తి సర్వస్వం కోల్పోతాడు. అప్పుడిక తన కొడుక్కి ఇచ్చేందుకు అతని దగ్గర చిల్లి గవ్వకూడా మిగలదు.

15 తల్లి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా వస్తువుల కోసం చచ్చేలా శ్రమిస్తాడు. కాని, తాను చనిపోయినప్పుడు అతను తన వెంట తీసుకువెళ్లగలిగింది ఏమీ ఉండదు.

16 ఇది చాలా విచారకరమైన విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే పోతాడు. కాగా, “గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి?

17 దుఃఖంతో, విచారంతో నిండిన రోజులు. నిరాశా నిస్పృహలు అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే!


మీ జీవిత కృషి ఫలితాన్ని అనుభవించండి

18 ఈ భూమిమీద ఉత్తమమైనది ఏమనగా, తనకున్న స్వల్ప జీవితకాల వ్యవధిలో మనిషి అన్న పానాలు తృప్తిగా సేవించాలి, తన పని ఫలితాన్ని సుఖంగా అనుభవించాలి. దేవుడు అతనికి ఇచ్చినది ఈ కొద్ది రోజులు మాత్రమే అన్న విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి ఇదే మనిషి చేయగలిగినదన్న విషయాన్ని నేను గమనించాను.

19 దేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని హాయిగా అనుభవించే శక్తిని ఇస్తే, ఆ వ్యక్తి వాటిని అనుభవించాలి. ఆ వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి.

20 మనిషి ఆయుష్షు సుదీర్ఘమైనది కాదు కనుక, అతని విషయాలన్నీ తన జీవితం పొడుగునా గుర్తుంచు కోవాలి. ఆ మనిషి ఇష్టంగా చేసే పనిలో దేవుడు అతన్ని నిమగ్నుణ్ణి చేస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan