ప్రసంగి 3 - పవిత్ర బైబిల్ప్రతిదానికి ఒక తరుణం 1 ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది. 2 పుట్టేందుకొక సమయం వుంది, చనిపోయేందుకొక సమయం వుంది. మొక్కలు నాటేందుకొక సమయం వుంది, మొక్కలు పెరికేందుకొక సమయం వుంది. 3 చంపేందుకొక సమయం వుంది, గాయం మాన్పేందుకొక సమయం వుంది. నిర్మూలించేందుకొక సమయం వుంది, నిర్మించేందుకొక సమయం వుంది. 4 ఏడ్చేందుకొక సమయం వుంది, నవ్వేందుకొక సమయం వుంది. దుఃఖించేందుకొక సమయం వుంది. సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది. 5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది, వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది. ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది, ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది. 6 దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది, అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది. వస్తువులు పదిలపర్చు కొనే సమయం వుంది, వాటిని పారవేసే సమయం వుంది. 7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది. 8 ప్రేమించేందుకొక సమయం వుంది, ద్వేషించేందుకొక సమయం వుంది. సమరానికొక సమయం వుంది, శాంతికొక సమయం వుంది. దేవుడు తన జగత్తుని అదుపు చేస్తాడు 9 మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (లేదు!) 10 చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను. 11 తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు. అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు. 12 తాము బతికినంత కాలము సంతోషంగా ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న విషయం నేను గ్రహించాను. 13 ప్రతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని ఆహ్లాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి దేవుడిచ్చిన వరాలు. 14 దేవుడు చేసేది ప్రతీది శాశ్వతంగా కొనసాగుతుందని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసినదానికి మనుష్యులు దేన్నీ ఎంతమాత్రం జోడించలేరు మరియు దేవుడు చేసే పనినుండి దేనినీ తీసుకొనలేరు. మనుష్యులు తనని గౌరవించేందుకే దేవుడు ఇదంతా చేశాడు. 15 గతంలో జరిగినవేవో జరిగాయి, (మరి మనం వాటిని మార్చలేము.) భవిష్యత్తులో జరగ బోయేవేవో జరుగుతాయి. (మనం వాటిని మార్చలేము) అయితే, ఎవరైతే చెడ్డగా చూడబడ్డారో, వారికి దేవుడు మంచి చెయ్యాలని కోరుకుంటాడు. 16 ఈ ప్రపంచములో యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే అక్కడ మనం కనుగొంటుంది చెడుగు. 17 అందుకని, నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.” మనుష్యులకి జంతువులకి భేదమే లేదా? 18 మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, “తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని మనుష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు. 19 మనిషి జంతువుకంటే మెరుగైనవాడా? (కాడు) ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ర్పయోజనం కనుక. మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే ‘ఊపిరి’ మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా? 20 అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి. 21 మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?” 22 అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను. అదే వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటే, భవిష్యత్తు గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు మనిషికి ఎవ్వరూ తోడ్పడలేరు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International