ద్వితీ 22 - పవిత్ర బైబిల్ఇతర ఆజ్ఞలు 1 “నీ పొరుగు వాని ఆవు లేక గొర్రె తప్పి పోయి తిరగటం నీవు చూసినప్పుడు చూడనట్టు విస్మరించకూడదు. నీవు దాన్ని తప్పక దాని యజమాని దగ్గరకు తీసుకొని వెళ్లాలి. 2 ఆ యజమాని నివాసం నీకు దగ్గర్లో లేకపోతే, లేక అది ఎవరిదో నీకు తెలియకపోతే అప్పుడు ఆ ఆవును లేక గొర్రెను నీ ఇంటికి నీవు తీసుకొని వెళ్లాలి. దాని యజమాని దానికోసం వెదకుకొంటూ వచ్చేంతవరకు నీవు దానిని నీ దగ్గర ఉంచాలి. అప్పుడు నీవు అతనికి దానిని తిరిగి ఇచ్చివేయాలి. 3 నీ పొరుగువాని గాడిద, నీ పొరుగువాని బట్టలు, లేక నీ పొరుగువాడు పోగొట్టుకొన్న దేని విషయంలోనైనా నీవు ఇలానే చేయాలి. నీ పొరుగువానికి నీవు సహాయం చేయాలి. 4 “నీ పొరుగువాని గాడిద లేక ఆవు దారిలో పడిపోతే నీవు దానిని చూడనట్టు పోకూడదు. దాన్ని లేవనెత్తటానికి నీవు అతనికి సహాయం చేయాలి. 5 “ఒక పురుషుని బట్టలను ఒక స్త్రీ ధరించకూడదు మరియు పురుషుడు స్త్రీల బట్టలు ధరించకూడదు. ఇలా చేసేవారు ఎవరైనాసరే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. 6 “నీవు దారిన నడుస్తుండగా ఒక పక్షిగూడును చెట్టుమీదగాని నేలమీదగాని నీవు చూడవచ్చును. తల్లి పక్షి పిల్ల పక్షులతోగాని గుడ్లమీదగాని కూర్చొని ఉంటే పిల్లలతోబాటు తల్లిపక్షిని నీవు తీసుకొనరాదు. 7 పిల్ల పక్షుల్ని నీవు తీసుకొనవచ్చు. కాని నీవు తల్లిని పోనివ్వాలి. ఈ ఆజ్ఞలకు నీవు విధేయుడవైతే నీకు అన్నీ సక్రమంగా జరుగుతాయి, నీవు చాలా కాలం బ్రతుకుతావు. 8 “నీవు కొత్త యిల్లు కట్టినప్పుడు దాని పై కప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలి. అప్పుడు ఆ యింటి మీదనుండి పడి చచ్చిన వారి మరణదోషం నీ మీద ఉండదు. జతపర్చబడకూడని విషయాలు 9 “నీ ద్రాక్షపొలంలో రెండు రకాల విత్తనాలు నీవు విత్తకూడదు. ఎందుకంటే అప్పుడు నీవు విత్తిన విత్తనపు పంట, నీ పొలంలోని ద్రాక్ష రెండూ నిష్ప్రయోజనం. 10 “గాడిదను, ఆవును కలిపి నీవు దున్నకూడదు. 11 “ఉన్ని, నార రెండూ కలిసి నేసిన బట్ట నీవు ధరించకూడదు. 12 “నీవు ధరించే అంగీకి నాలుగు మూలలా కుచ్చులు ఉండాలి. వివాహ చట్టాలు 13 “ఒక పురుషుడు ఒక యువతిని వివాహం చేసుకొని ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండ వచ్చును. ఆ తర్వాత ఆమె నచ్చలేదని అతడు చెప్పవచ్చు. 14 ‘నేను ఈమెను పెళ్లి చేసుకొన్నాను కానీ మేము లైంగికంగా కలిసినప్పుడు ఈమె కన్య కాదని నాకు తెలిసింది’ అని అతడు అబద్ధం చెప్పవచ్చు. ఆమెకు విరోధంగా ఇలా చెప్పటంవల్ల ప్రజలు ఆమెను గూర్చి చెడుగా భావిస్తారు. 15 ఇలా జరిగితే ఆమె తల్లిదండ్రులు ఆ పట్టణ సమావేశ స్థలం దగ్గర పెద్దల వద్దకు ఆమె కన్య అనే రుజువు తీసుకొని రావాలి. 16 ఆ యువతి తండ్రి పెద్దలతో చెప్పాలి, ‘నా కూతుర్ని ఇతనికి భార్యగా నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆమె అతనికి ఇష్టం లేదు. 17 ఇతడు నా కూతురి మీద అబద్ధాలు చెప్పాడు. “నీ కూతురు కన్య అనే ఋజువు నాకు కనబడలేదు” అని అతడు అన్నాడు. అయితే నా కూతురు కన్య, నా దగ్గర ఋజువుంది’ అప్పుడు వారు ఆమె బట్టను పట్టణ పెద్దలకు చూపించాలి. 18 అప్పుడు ఆ పట్టణ పెద్దలు అతన్ని పట్టుకొని శిక్షించాలి. 19 నూరు వెండితులాలు వారు అతనికి జుల్మానా విధించాలి. ఆమె భర్త ఒక ఇశ్రాయేలు యువతికి అవమానం కలిగించాడు గనుక ఆమె తండ్రికి వారు ఆ ధనం ఇవ్వాలి. ఆ యువతి ఆ పురుషునికి భార్యగా కొనసాగాలి. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 20 “అయితే ఒకవేళ ఆ భర్త తన భార్యను గూర్చి చెప్పిన విషయాలు నిజం కావచ్చును. ఆమె కన్య అని చెప్పేందుకు ఆ భార్య తల్లిదండ్రుల దగ్గర ఋజువు లేక పోవచ్చును. ఇలా జరిగితే 21 అప్పుడు ఆ పట్టణ నాయకులు ఆ యువతిని ఆమె తల్లిదండ్రుల ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకొని రావాలి. తర్వాత ఆ పట్టణంలోని మనుష్యులు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకంటే, ఇశ్రాయేలులో ఆమె అవమానకరమైన పని చేసింది. ఆమె తన తండ్రి ఇంటిలో ఒక వేశ్యలా ప్రవర్తించింది. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తీసివేయాలి. లైగింక పాపాలు 22 “ఒక పురుషుడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉంటే ఆ స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల ఆ పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి. 23 “మరొక పురుషునికి ప్రధానం చేయబడిన ఒక యువతిని ఇంకో పురుషుడు కలియవచ్చును. ఆతడు ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు. ఇది పట్టణంలో జరిగితే 24 మీరు వాళ్లిద్దర్నీ పట్టణ ద్వారం బయటకు తీసుకొని వచ్చి, మీరు వారిని రాళ్లలో కొట్టి చంపాలి. ఆ పురుషుడు మరొకని భార్యను లైగింక పాపానికి వాడుకున్నాడు గనుక మీరు ఆతడ్ని చంపాలి. ఆ యువతి పట్టణంలోనే ఉండి కూడా సహాయం కోరలేదు గనుక మీరు ఆ యువతిని చంపాలి. చెడ్డది ఏదైనా సరే మీ ప్రజల్లోనుండి మీరు తొలగించాలి. 25 “అయితే ప్రధానం చేయబడిన ఒక యువతిని ఒక పురుషుడు పొలంలో చూచి అతనితో లైగింక సంబంధం అనుభవించమని ఆమెను బలవంతం చేస్తే. అప్పుడు ఆ పురుషుడు మాత్రమే చావాలి. 26 ఆ యువతి మరణశిక్షకు పాత్రమైనది ఏమీ చేయలేదు, గనుక మీరు ఆమెను ఏమీ చేయకూడదు. ఒకడు మరొక అమాయకుని మీద దాడి చేసి హత్య చేసిన వంటిదే ఈ వ్యాజ్యెముకూడాను. 27 ఆ పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. ఆ యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. 28 “ఒక పురుషుడు ప్రధానం చేయబడని ఒక కన్యను చూచి, అతనితో లైగింక సంబంధం అనుభవించమని బలవంతం చేయవచ్చును. ఒకవేళ అతడు ఇలా చేయటం ప్రజలు చూస్తే 29 అప్పుడు అతడు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు యాభై తులాల వెండి ఇవ్వాలి. ఆ యువతి అతని భార్య అవుతుంది. ఎందుకంటే అతడు ఆమెను లైంగికంగా వాడుకొన్నాడు గనుక. అతడు తన జీవితాంతం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 30 “ఒక పురుషుడు తన తండ్రి భార్యతో లైంగింక సంబంధం కలిగియుండి తన తండ్రికి అవమానం కలిగించకూడదు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International