Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

దానియేలు 10 - పవిత్ర బైబిల్


హిద్దెకెలు నది దగ్గర దానియేలు దర్శనము

1 పారసీక రాజగు కోరెషు పాలన మూడవ సంవత్సరంలో, బెల్తెషాజరు అను దానియేలుకు ఒక విషయం తెలియపర్చబడింది. అది యుద్ధమును గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియేలుకు బయలుపడింది గనుక అతడు గ్రహించాడు.

2 ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను.

3 ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు.

4 మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది అయిన టైగ్రిసు (హిద్దెకెలు) నది గట్టుమీద నేను నిలబడి ఉన్నాను.

5 నేనక్కడ నిలబడి కన్నులెత్తి చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టలు ధరించుకొని, నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని యున్నాడు.

6 ఆయన శరీరం గోమేధికంవలె పసుపుగాను, ముఖం మెరుపువలె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాలవలె కనిపించానియి చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్దం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి.

7 దానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం చూశాను. నా వెంటనున్న మనుష్యులు ఆ దర్శనం చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారిపోయి దాగుకొన్నారు.

8 అందువల్ల నేను ఒంటరి వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము లేనివాడనయ్యాను. మృతుడైనవాని ముఖంవలె నా ముఖం పాలిపోయి బలంలేని వాడనయ్యాను.

9 దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. అతను మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన వాడనై నేలమీద సాష్టాంగ పడ్డాను.

10 అప్పుడు ఒకని చెయ్యి నన్ను తాకి, వణకుచున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను నిలువ బెట్టింది.

11 అతడు నాతో, “బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువబడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను” అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను.

12 అప్పుడు అతడు నాతో, “దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థిస్తూంన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను.

13 పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను.

14 అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది” అని చెప్పాడు.

15 అతడు అలా మాటలాడుతూ ఉండగా, నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉండిపోయాను.

16 మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, “అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది బలము లేని వాడనయ్యాను.

17 అయ్యా! నీ సేవకుడనైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలంపోయింది. నాకు ఊపిరి ఆడనట్లయింది” అని అన్నాను.

18 మానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను ముట్టి, బలపరిచాడు.

19 అతడు నాతో, “బహు ప్రియుడవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు” అని అన్నాడు. అతడు మాటలాడగానే నేను బలం పొంది ఇలాగన్నాను: “అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.”

20 అప్పుడు అతను, “దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు.

21 సత్య గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది నేను నీకు చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan