ఆమోసు 6 - పవిత్ర బైబిల్ఇశ్రాయేలు నుండి మంచిరోజులు తొలగింపబడటం 1 సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సమరయ పర్వతంమీద ఉన్న ప్రజలలో కొంతమంది సురక్షితంగా ఉన్నట్లు తలంచుచున్నారు. కాని మీకు చాలా దుఃఖము కలుగుతుంది. మీరు ప్రాముఖ్యమైన జనాంగపు ముఖ్య నాయకులు. ఇశ్రాయేలు ప్రజలు సలహా కొరకు మీ వద్దకు వస్తారు. 2 మీరు వెళ్లి కల్నేలో చూడండి. అక్కడనుండి పెద్ద నగరమైన హమాతుకి వెళ్లండి. ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి. ఆ రాజ్యాలకంటే మీరేమైనా గొప్పవారా? లేదు. మీ దానికంటే వారి రాజ్యాలు విశాలమైనవి. 3 శిక్షా దినము బహు దూరాన ఉన్నదనుకొని, దౌర్జన్య పరిపాలనకు దగ్గరవుతున్నారు. 4 కాని మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు. మీరు దంతపు మంచాలపై పడుకుంటారు. మీ పాన్పులపై మీరు చాచుకొని పడుకుంటారు. మందలోని మంచి లేత గొర్రె పిల్లలను, పశువులశాలలోని మంచి చిన్న గిత్త దూడలను మీరు తింటారు. 5 మీరు స్వరమండలాలను వాయిస్తారు. దావీదువలె మీరు కనిపెట్టిన వాద్య విశేషాలపై సాధన చేస్తారు. 6 చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు. మీరు శ్రేష్ఠమైన పరిమళ తైలాలు వాడతారు. యోసేపు వంశం నాశనమవుతూ ఉందని కూడా మీరు కలవరం చెందరు. 7 ఆ ప్రజలు వారి పాన్పులపైన చాచుకొని పడుకున్నారు. కాని వారి మంచి రోజులు అంతమవుతాయి. వారు బందీలవలె అన్యదేశాలకు తీసుకొనిపోబడతారు. ముందుగా అలా పట్టుకుపోబడే వారిలో ఈ ప్రజలు వుంటారు. 8 ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు: “యాకోబుకు గర్వకారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను. అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను. అందుచేత ‘శత్రువు’ నగరాన్ని, దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.” ప్రాణంతో మిగిలే ఇశ్రాయేలీయులు తక్కువ 9 ఆ సమయంలో ఒకానొక ఇంట్లో పదిమంది జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది మరణించవచ్చు. 10 ఒక బంధువు ఆ శవాన్ని బయటకు తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు ఇంటినుంచి ఎముకలు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో దాగిన ఏ వ్యక్తినైనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా ఏమైనా శవాలు మిగిలియా?” అని అడుగుతారు. ఆ వ్యక్తి, “లేవు …” అని సమాధానమిస్తాడు. అప్పుడా వ్యక్తియొక్క బంధువు ఇలా అంటాడు: “నిశ్శబ్దం! మనం యెహోవా మాట ఎత్తకూడదు.” 11 చూడు, దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇవ్వగా, పెద్ద ఇండ్లు ముక్కలుగా పగిలిపోతాయి. చిన్న ఇండ్లు చిన్న ముక్కలైపోతాయి. 12 గుర్రాలు బండలపై పరుగిడతాయా? లేదు! ప్రజలు ఆవులను నేల దున్నటానికి వినియోగిస్తారా? అవును! కాని మీరు అన్నిటినీ తారుమారు చేస్తారు. మీరు మంచిని, న్యాయాన్ని విషంగా మార్చారు. 13 మీరు లో-దెబారులో సుఖంగా ఉన్నారు. “మేము కర్నయీమును మా స్వశక్తిచే తెచ్చుకున్నాం” అని మీరంటారు. 14 “కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను. ఆ రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. లేబో-హమాతు నుండి అరాబా వాగువరకూ మీ అందరికీ కష్టాలు వస్తాయి.” దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International