Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆమోసు 4 - పవిత్ర బైబిల్


విలాసవంతులైన స్త్రీలు

1 సమరయ (షోమ్రోను) కొండమీదగల బాషాను ఆవుల్లారా నేను చెప్పేది వినండి. మీరు పేద ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదైనా తీసికొని రండి!” అని మీరు మీ భర్తలకు చెపుతారు.

2 నా ప్రభువైన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా చెప్పాడు. శత్రు ప్రజలు మీకు కొంకెలు తగిలించి లాగుతారు. మీ పిల్లను లాక్కుపోవటానికి చేపలు పట్టే గాలాలను ఉపయోగిస్తారు.

3 మీ నగరం నాశనం చేయబడుతుంది. మీ స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ కంతలగుండా నగరంనుండి బయటకు పోతారు. చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదికి విసరివేస్తారు. యెహోవా ఇది చెపుతున్నాడు:

4 “బేతేలుకు వెళ్లి పాపం చేయండి! గిల్గాలుకు వెళ్లి మరింత పాపం చేయండి. మీ బలులను ఉదయ వేళల్లో ఇవ్వండి. మీ పంటలో పదవవంతు మూడు రోజులకొకసారి తీసికొని రండి.

5 పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి. యెహోవా చెప్పేది ఇదే.

6 “నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

7 “నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది.

8 కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

9 “ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని, మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు” అని యెహోవా చెపుతున్నాడు.

12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”

13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే. మీ మనస్సులను సృష్టించింది నేనే. ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే. సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను. ఇట్టి నేను ఎవరిని? సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan