Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ఆమోసు 2 - పవిత్ర బైబిల్


మోయాబుకు శిక్ష

1 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబువారు కాల్చివేశారు.

2 కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వినబడతాయి. మోయాబు చనిపోతాడు.

3 అలా నేను మోయాబు రాజులను నిర్మూలిస్తాను. మరియు మోయాబు నాయకులందరినీ నేను చంపివేస్తాను అని యెహోవా చెపుతున్నాడు.”


యూదాకు శిక్ష

4 యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదావారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు యెహోవా ఆజ్ఞలను పాటించ నిరాకరించారు. వారాయన ఆజ్ఞలను స్వీకరించలేదు. వారి పూర్వీకులు అబద్ధాలను నమ్మారు. ఆ అబద్ధాలే యూదా ప్రజలను దేవుని అనుసరించకుండా చేశాయి.

5 కావున యూదాలో అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని యెరూషలేములోగల ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.”


ఇశ్రాయేలుకు శిక్ష

6 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు.

7 పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, వారిపై తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు.

8 పేద ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాలముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలా వారు చేస్తారు. ఆ డబ్బును వారు తమ దేవుని ఆలయంలో తాగటానికి ద్రాక్షామద్యం కొనడానికి వినియోగిస్తారు.

9 “కాని, అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయినవారు. వారు సిందూర వృక్షమంత బలంగలవారు. కాని, పైన వాటి పండ్లను, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను.

10 “ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని తీసుకొని వచ్చింది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై నలబై సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను.

11 మీ కుమారులలో కొంతమందిని నేను ప్రవక్తలుగా చేశాను. మీ యువకులలో కొంతమందిని నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా! ఇది నిజం అని యెహోవా చెపుతున్నాడు.

12 కాని, నాజీరులు ద్రాక్షామద్యం తాగేలా మీరు చేశారు. దేవుని మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు.

13 మీరు నాకు పెద్ద భారమయ్యారు. అధికమైన గడ్డివేసిన బండిలా నేను చాలా కిందికి వంగిపోయాను.

14 ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరుగెత్తగలవాడైనా తప్పించుకోలేడు. బలవంతులు బలంగా లేరు. సైనికులు తమను తాము రక్షించుకోలేరు.

15 విల్లంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకరు. వేగంగా పరుగిడగలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణాలతో తప్పించుకోలేరు.

16 ఆ సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకొనటానికికూడా సమయం తీసుకోరు అని దేవుడైన యెహోవా చెపుతున్నాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan