Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 రాజులు 5 - పవిత్ర బైబిల్


నయమాను సమస్య

1 సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకు అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తిమంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు.

2 ఇశ్రాయేలులో యుద్ధం చేయడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా ఉంది.

3 ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠువ్యాధిని బాగుచేయగలడు.”

4 నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.

5 అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకు ఒక లేఖ పంపుతాను” అన్నాడు. అందువల్ల నయమాను ఇశ్రాయేలుకు వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళ్ళాడు.

6 సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠువ్యాధిని నివారించుము.”

7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠువ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు.

8 ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “నీవు నీ దుస్తులు ఎందుకు చింపివేసుకొన్నావు? నయమానుని నా వద్దకు పంపు. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నట్లు తెలుసుకుంటాడు.”

9 ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు.

10 ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు.

11 నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను.

12 దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు.

13 కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.”

14 అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.

15 నయమాను మరియు అతని బృందంవారు దైవజనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ ప్రపంచంలో మరెచ్చట కూడా దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వికరింపుము” అని పలికాడు.

16 కాని ఎలీషా, “నేను యెహోవాను సేవిస్తున్నాను. యెహోవా జీవముతోడు, నేను ఎట్టి కానుకను స్వీకరింపనని వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు. నయమాను కష్టతరంగా అతనిని సముదాయించుటకు ప్రయత్నించాడు. కాని ఎలీషా తిరస్కరించాడు.

17 అప్పుడు నయమాను, “ఈ కానుకను కనుక నీవు స్వీకరించపోతే, కనీసం ఇదైనా నా కోసం చేయుము. నారెండు కంచర గాడిదలు మీది గంపలను ఇశ్రాయేలు దేశపు మన్నులో నింపుటకు అనుమతింపుము. ఎందుకనగా, ఇతర దేవతలకు నేను ఎన్నటికీ ఎటువంటి బలులు సమర్పించను, యెహోవాకి మాత్రమే సమర్పిస్తాను.

18 ఇది చేయడం వల్ల నన్ను యెహోవా క్షమించునట్లు యెహోవాని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో, నా యజమాని (సిరియా రాజు) రిమ్మోను ఆలయంలోకి వెళ్లి అసత్య దేవతలను పూజిస్తాడు. రిమ్మోను ఆరాధన జరుగునప్పుడు నా సహాయము కొరకు రాజు నా మీద ఆధారపడి వుంటాడు. అందువల్ల నేను రిమ్మోను ఆలయంలో మోకరిల్లుతాను. అలా జరిగినప్పుడు నన్ను క్షమింపుమని యెహోవాని వేడుకొనుచున్నాను” అని పలికాడు.

19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకు చెప్పాడు. అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు.

20 కాని దైవజనుడు అయిన ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని (ఎలీషా) సిరియనుడయిన నయమానుని వెళ్లనిచ్చాడు. కాని అతడు తెచ్చిన కానుకను స్వీకరించలేదు. యెహోవా జీవము తోడుగా వెనుకనే నేను పరిగెత్తుకుపోయి, అతని వద్దనుంచి ఏదైనా తీసుకువస్తాను” అని అనుకున్నాడు.

21 అందువల్ల గేహజీ నయమాను వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్లు నయమాను గ్రహించి. అతను తన రథం దిగి గేహజీని కలుసుకుని, “అంతా సవ్యంగా వుందిగదా” అని నయమాను అడిగాడు.

22 “అవును. అంతా సవ్యంగానే వుంది. నా యజమాని (ఎలీషా) నన్ను పంపాడు. ఇద్దరు యువకులు నావద్దకు వచ్చారనీ, కొండ దేశమైన ఎఫ్రాయిము నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందిన వారనీ, వారికి డెభైఐదు పౌన్లు వెండి మరియు రెండురకాల దుస్తులు ఇమ్మని ఆయన చెప్పాడు” అని గేహజీ చెప్పాడు.

23 “అయ్యా, నూట ఏభై పౌన్లు తీసుకోండి” అని నయమాను చెప్పాడు. గేహజీ ఆ వెండిని తీసుకునేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయమాను నూట ఏభై పౌన్లు వెండిని రెండు సంచులలో వేసి, రెండు రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దిరకి ఇచ్చాడు. గేహజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు వెళ్లారు.

24 గేహజీ కొండ వద్దకు రాగానే, ఆ వస్తువులను అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, ఆ సేవకులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత గేహజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు.

25 గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు. “నేనెక్కడికీ వెళ్లలేదు” అని గేహజీ చెప్పాడు.

26 “ఇది నిజం కాదు నిన్ను కలుసుకునేందుకు నయమాను తన రథంనుంచి క్రిందికి దిగినప్పుడు నా హృదయం నీతో వున్నది. పైకం, వస్త్రాలు, ఒలివలు, ద్రాక్షలు, గొర్రెలు, ఆవులు లేక స్త్రీ పురుష సేవకులు మొదలైనవి తీసుకునేందుకు ఇది సమయం కాదు.

27 ఇప్పుడు నీకు, నీ వంశానికి నయమాను వ్యాధి సంక్రమిస్తుంది. ఎల్లప్పుడూ నీకు కుష్ఠువ్యాధి వుంటుంది” అని ఎలీషా గేహజీతో చెప్పాడు. ఎలీషాని విడిచి గేహజీ వెళ్లగానే, గేహజీ శరీరం మంచువలె తెల్లగా కనిపించింది. గేహజీకి కుష్ఠువ్యాధి కలిగింది.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan