2 రాజులు 12 - పవిత్ర బైబిల్యోవాషు పరిపాలన ప్రారంభించుట 1 ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. 2 యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు. 3 కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆనాటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు. యోవాషు ఆలయ పునరుద్ధరణకు ఆజ్ఞాపించుట 4-5 “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దేశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ఆ ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి ఆ డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు. 6 కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23వ సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు. 7 అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు. 8 ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించుకున్నారు. 9 అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి ప్రక్కగా వున్నది. కొందరు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు. 10 తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకొని, ఆ డబ్బును సంచులలో వేసి లెక్కించారు. 11 యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు. 12 రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు. 13-14 యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బును వెండి కప్పులు, దీపాలు వెలిగించేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగు చేశారు. 15 ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు. 16 అపరాధ పరిహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది. హాజాయేలు నుండి యోవాషు యెరూషలేమును రక్షించుట 17 సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతికూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు. 18 యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు ఆ విలువగల వస్తువులను సిరియా రాజైన హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు. యోవాషు మరణం 19 యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 20 యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు. 21 షిమాతు కుమారుడైన యోజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు. దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అమజ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International