2 రాజులు 11 - పవిత్ర బైబిల్అతల్యా యూదాలోని రాజకుమారులందరిని చంపుట 1 అతల్యా అహజ్యా యొక్క తల్లి. తన కుమారుడు చనిపోయినట్లు ఆమె చూసింది. అందువల్ల ఆమె లేచి రాజవంశం అంతటినీ చంపివేసింది. 2 యెహోషెబ రాజైన యెహోరాము యొక్క కుమార్తె. అహజ్యా సోదరి. యోవాషు రాజ కుమారులలో ఒకడు. మిగిలిన పిల్లలు చంపబడినప్పుడు యెహోషెబ యెవాషును తీసుకుని దాచింది. ఆమె యెవాషును అతని దాదిని ఆమె పడక గదిలో ఉంచింది. అందువల్ల యెహోషెబ మరియు దాది అతల్యాకి తెలియకుండా యెవాషును కాపాడారు. ఆ విధంగా యోవాషు మరణించలేదు. 3 తర్వాత యోవాషు మరియు యెహోషెబా యెహోవా యొక్క ఆలయంలో దాగివున్నారు. అక్కడ యోవాషు ఆరు సంవత్సరములు దాగివున్నాడు. మరియు అతల్యా యూదా దేశాన్ని పరిపాలించింది. 4 ఏడవ సంవత్సరమున ప్రధాన యాజకుడయిన యెహోయాదా సైనికుల అధిపతులను కాపలాదారులను రప్పించాడు. యెహోయాదా వారిని యెహోవా ఆలయములో ఒక చోట సమకూర్చాడు. తర్వాత యెహోయాదా వారితో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఆలయంలో యెహోయాదా వారిని ఒక వాగ్దానం చేయమని నిర్భందించాడు. అప్పుడు వారికి రాజుగారి కుమారుడైన యెవాషును చూపించాడు. 5 తర్వాత యెహోయాదా వారికొక ఆజ్ఞ విధించాడు. “ఈ పని మీరు చెయ్యాలి. ప్రతి విశ్రాంతి రోజున మీలో ఒక మూడోవంతు రావాలి. మీరు రాజభవనాన్ని కాపలా కాయాలి. 6 రెండో మూడోవంతు సూరు ద్వారం వద్ద వుండాలి. మరియు మరియొక మూడోవంతు కాపలాదారులకు వెనకాల ద్వారం వద్ద వుండాలి. ఈ విధంగా మీరు ఒక గోడవలె యెవాషును రక్షించాలి. 7 ప్రతి విశ్రాంతి రోజు మీలో రెండువంతులు యెహోవా ఆలయాన్ని కాపలా కాయాలి. యెవాషు రాజుని రక్షించాలి. యెవాషు రాజు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్లినా మీరు అతని వెంట వుండాలి. 8 మొత్తం రాజుని అవరించి వుండాలి. ప్రతి కాపలాదారుడు తన ఆయుధాన్ని చేత ధరించి వుండాలి. మీకు మరీ దగ్గరగా వచ్చే ఎవనినైనా మీరు హతమార్చాలి” అని అన్నాడు. 9 యెహోయాదా యాజకుడు ఆజ్ఞాపించిన అన్నిటినీ అధిపతులు పాటించారు. ప్రతి అధిపతి తన మనుష్యులను తీసుకున్నాడు. ఒక బృందమేమో శనివారంనాడు రాజుకు కాపలాగా ఉండాలి. వారం మిగిలిన రోజుల్లో ఇతర బృందాలు రాజుకు కాపలాగా వుండాలి. యెహోయాదా యాజకుని వద్దకు ఆ మనుష్యులందరు వెళ్లారు. 10 మరియు యాజకుడు బల్లెములు, కవచములు అధిపతులకు ఇచ్చాడు. ఆ బల్లెములు కవచములు యెహోవా ఆలయంలో దావీదు ఉంచినవి. 11 ఈ కాపలాదార్లు ఆయుధములు ధరించి ఆలయం కుడి మూలనుంచి మరియు ఆలయం ఎడమ మూలవరకు నిలబడ్డారు. వారు బలిపీఠం, ఆలయం చుట్టూ నిలబడ్డారు. వారు దేవాలయంలో రాజును కాపాడడానికి అతని చుట్టూ నిలబడ్డారు. 12 ఈ మనుష్యులు యోవాషును బయటకు తీసుకొని వచ్చి, అతని తల మీద వారు కిరీటం ఉంచారు. దేవునికీ రాజుకూ మధ్య జరిగిన ఒడంబడికను రాజుకి ఇచ్చారు. తర్వాత వారు అతనిని అభిషేకించి కొత్త రాజుగా చేశారు. “రాజు వర్ధిల్లుగాక!” అని వారు కరతాళ ధ్వనులు చేశారు; నినాదాలు చేశారు. 13 రాణి అతల్యా కాపలాదారులు మరియు ప్రజల నుండి శబ్ధం విన్నది. అందువల్ల ఆమె యెహోవా ఆలయం వద్దనున్న ప్రజల దగ్గరకు వెళ్లింది. 14 అతల్యా మామూలుగా రాజు నిలబడే స్తంభం వద్ద రాజుని చూసింది. రాజుకోసం బాకాలూదే నాయకులను ప్రజలను కూడా ఆమె చూసింది. అందరు మనుష్యులు చాలా సంతోషంగా వున్నట్లు ఆమె చూసింది. బూరలు మ్రోగాయి. ఆమె తలక్రిందులయినట్లుగా తెలుపడానికి తన వస్త్రములు చింపుకొన్నది. తర్వాత అతల్యా, “రాజ ద్రోహం, రాజద్రోహం” అని అరిచింది. 15 సైనికులు అధికారులుగానున్న అధిపతులకు యాజకుడు అయిన యెహోయాదా ఒక ఆజ్ఞ విధించాడు. “ఆలయం వెలుపలికి అతల్యాను తీసుకొని వెళ్లండి. ఆమెనూ, అనుచరులనూ చంపండి. కాని యెహోవా ఆలయంలో వారిని చంపకండి” అని యెహోయాదా వారికి చెప్పాడు. 16 అందువల్ల సైనికులు అతల్యాను లాగివేశారు. అంతఃపురానికి గుర్రాలు వెళ్లే ప్రవేశంగుండా ఆమె వెళ్లేటప్పుడు ఆమెను చంపివేశారు. 17 తర్వాత యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడిక రాజు, ప్రజలు యెహోవాకి చెందిన వారని తెలుపుతుంది. యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య కూడా ఒక ఒడంబడిక చేశాడు. ప్రజలకు రాజు ఏమి చేయాలో ఈ ఒడంబడిక తెలుపుతుంది. ప్రజలు విధేయులై రాజుని అనుసరిస్తారని ఈ ఒడంబడిక తెలుపుతుంది. 18 తర్వాత మనుష్యులు అందరు అసత్య దేవత బయలు ఆలయానికి వెళ్లారు. ఆ మనుష్యులు బయలు విగ్రహాన్ని, అతని బలిపీఠాలను ధ్వంసం చేశారు. వాటిని వారు ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ మనుష్యులు బయలు యొక్క యాజకుడు మత్తానును బలిపీఠముల వద్ద చంపివేశారు. అందువల్ల యాజకుడు అయిన యెహోయాదా యెహోవా ఆలయాన్ని ఆ మనుష్యుల అధికారమున నిర్వహణార్థం ఉంచాడు. 19 యాజకుడు మనుష్యులందరిని నడిపించాడు. వారు యెహోవా ఆలయంనుండి రాజు ఇంటివరకు వెళ్లారు. రాజు ప్రత్యేక కాపలాదార్లు, అధిపతులు రాజుతోపాటు వెళ్లారు. మరియు మనుష్యులందరూ వారిని అనుసరించారు. వారు రాజభవన ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లారు. యెవాషు రాజు సింహాసనం మీద ఉన్నాడు. 20 మనుష్యులు అందరు చాలా సంతోషంగా వున్నారు. నగరం శాంతంగా ఉంది. మరియు రాణి అతల్యా రాజభవనం వద్ద కత్తితో చంపబడింది. 21 యోవాషు రాజయినప్పుడు, అతను ఏడేండ్లవాడు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International