Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 9 - పవిత్ర బైబిల్


సౌలు తన తండ్రి గాడిదలను వెదకబోవటం

1 బెన్యామీను గోత్రమునకు చెందిన వారిలో కీషు చాలా ముఖ్యడు. అతను అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు. సెరోరు బెకోరతు పుత్రుడు. బెకోరతు బెన్యామీనీయుడైన అఫీయ కుమారుడు.

2 కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు చాలా అందగాడు. సౌలుకంటె ఎక్కువ అందగాడు మరొకడు లేడు. ఇశ్రాయేలీయులందరిలోనూ అతడు ఆజానుబాహుడు.

3 ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక “సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవలసిందిగా” కీషు తన కుమారుడైన సౌలుతో చెప్పాడు.

4 ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వెదికారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కోలేకపోయారు. వారు షయలీము ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి దొరకలేదు.

5 చివరికి సౌలు, అతని సేవకుడు కలసి సూపు పట్టణానికి వచ్చారు. సౌలు, “ఇంటికి వెళ్లి పోదామని తన సేవకునితో అన్నాడు. తన తండ్రి గాడిదల విషయం మర్చిపోయి తమను గురించి కంగారు (చింత) పడతాడని” అన్నాడు సౌలు.

6 “మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ అతను చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.

7 “సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్దాము. కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేందుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు.

8 “చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని ఆ దైవజనుడికి ఇద్దాము. అప్పుడాయన మన ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు.

9-11 “ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం వైపు బయలుదేరి వెళ్లారు. సౌలు, “సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయటికి వస్తున్నారు.” “దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను, “దీర్ఘదర్శి” అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకొంటే, “దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే వాళ్లు).

12 అది విన్న యువతులు, “అవును ఆ దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ వేళే పట్టణంలోకి వచ్చాడు. వీధిలో ఉన్నాడు ఆరాధనా స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు ఈ వేళ సమావేశం అవుతున్నారు.

13 మీరు పట్టణంలోకి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే, ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు చెప్పారు.

14 సౌలు, అతని సేవకుడు పట్టణానికి వెళ్లారు. పట్టణంలోకి వెళ్లగానే వారు సమూయేలును చూసారు. ఆరాధనకు వెళ్లే నిమిత్తం సమూయేలు పట్టణంలోనుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు.

15 ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు:

16 “రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి నా ప్రజల బాధ నేను గమనించాను. నా ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.”

17 సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; నా ప్రజలను పాలించువాడితడే” అన్నాడు.

18 సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూయేలును అడిగాడు.

19 “నేనే దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధనా స్థలానికి వెళ్లు. ఈ రోజు నీవు, నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను.

20 మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు.

21 అది విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి చెందిన వాడిని! ఇశ్రాయేలు అంతటిలో నావంశం చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు కోరుతూ వుందని ఎందుకు చెబుతున్నావు?” అని అడిగాడు.

22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది మంది ఆహ్వానించబడ్డారు.

23 వంటవానితో సమూయేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యేకంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం అది” అన్నాడు.

24 వంటవాడు తొడ మాంసాన్ని తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.

25 భోజనాలు అయిన తరువాత వారు ఆరాధనా స్థలం నుండి క్రిందికి దిగి పట్టణంలోకి వెళ్లారు. ఒక మిద్దెమీద సౌలుకు పడక ఏర్పాటు చేసారు. అక్కడ సౌలు నిద్రపోయాడు.

26 మరునాడుతెల్లవారుఝామున సమూయేలు లేచి మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్దేరు, నిన్ను నీ దారిని నేను పంపిస్తాను” అన్నాడు సమూయేలు. సౌలు లేచి సమూయేలుతో కలిసి బయటికి వెళ్లాడు.

27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan