Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 8 - పవిత్ర బైబిల్


రాజుకొరకు ఇశ్రాయేలు ప్రజల అభ్యర్థన

1 సమూయేలు వృద్ధుడయిన పిమ్మట తన కుమారులను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా నియమించాడు.

2 సమూయేలు మొదటి కుమారుని పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ బెయేర్షెబాలో న్యాయాధిపతులు.

3 కాని సమూయేలు కుమారులకు తండ్రి నడవడి రాలేదు. యోవేలు, అబీయా, ఇద్దరూలంచం ద్వారా ధన సంపాదనకు పాల్పడినారు. తమ తీర్పులను తారుమారు చేయటానికి ప్రజలను మోసంచేసి రహస్యంగా లంచాలు తీసుకునేవారు.

4 కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు.

5 వారు సమూయేలుతో, “నీవు వృద్ధుడవు. పైగా నీ కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు.

6 ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు.

7 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను కాదు.

8 వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఈజిప్టునుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్ల కూడా వారిప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు.

9 అయినా నీవు ప్రజలు చెప్పిన దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.”

10 రాజుకొరకు అడుగుతున్న ప్రజలకు సమూయేలు సమాధాన మిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన విషయమంతా సమూయేలు ప్రజలకు ఇలా వివరంగా చెప్పాడు:

11 “మిమ్మల్ని పాలించేందుకు మీకు గనుక ఒక రాజు ఉంటే అతడు ఇలా చేస్తాడు: అతడు మీ కుమారులను తనకు సేవ చేసేటట్లు బలవంతంచేస్తాడు. అతడు వారిని బలవంతంగా సైనికులుగా చేస్తాడు. వారిని తన రథాలలో, అశ్వదళాలలో పని చేయిస్తాడు. మీ కుమారులు రాజు రథానికి ముందు పరుగెత్తే సంరక్షకులు అవుతారు.

12 “రాజు మీ కుమారులలో కొంతమందిని వేయిమంది మీద అధికారులుగాను, ఏబదిమంది మీద అధికారులుగాను చేస్తాడు. మీ సంతతిలో మరికొంత మందిని రాజు తన భూమిని సాగు చేయుటకు, మరికొంత మందిని పంట కోయుటకు నియమిస్తాడు. “ఇంకా కొంతమందిని యుద్ధ పరికరాలను, ఆయుధాలను తయారు చేసేందుకు, ఆయన రథాలకు కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చటానికి రాజు వినియోగిస్తాడు.”

13 “ఈ రాజు మీ కుమార్తెలను కూడా తీసుకుని, వారిలో కొంతమందిని అత్తరులు చేసేందుకు, మరికొంత మందిని ఆయన ఆహార పదార్థాలు తయారు చేయటానికి వినియోగిస్తాడు.

14 “ఈ రాజు మీ భూములలో శ్రేష్ఠమైన వాటిని, ద్రాక్షాతోటలను, ఒలీవ తోటలను తీసుకుంటాడు. వాటిని తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.

15 మీ పంటలోను, ద్రాక్ష దిగుబడిలోను పదవవంతు అతను తీసు కుంటాడు. ఈ పదవ భాగాన్ని రాజు తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.

16 “ఈ రాజు మీ సేవకులను, పనిపిల్లలను కూడ తీసుకుంటాడు. మీకున్న మంచి మంచి పాడి పశువులను, గాడిదలను కూడా తీసుకుంటాడు. వారందరినీ తన స్వంత పనులకు వినియోగించుకుంటాడు.

17 అతను మీ గొర్రెల మందలలో పదవవంతు తీసుకుంటాడు. “అసలు మీరు కూడా ఈ రాజుకు బానిసలైపోతారు.

18 ఆ సమయం వచ్చినప్పుడు మీరెన్నుకున్న రాజు మూలంగా మీరు చాలా ఏడుస్తారు. కానీ యెహోవా మాత్రం ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు.”

19 సమూయేలు ఇంత చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా ఇలా అన్నారు: “కాదు! మమ్ములను ఏలటానికి మాకో రాజు కావాలి.

20 అప్పుడు మేము ఇతర రాజ్యాలతో సమాన ప్రతిపత్తిగల వారమవుతాము. మా రాజే మా నాయకుడు. యుద్ధంలో ఆయన మమ్మల్ని నడిపించి, మాకోసం ఆయన యుద్ధం చేస్తాడు.”

21 ప్రజలు చెప్పినదంతా విన్న సమూయేలు వారు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేసాడు.

22 “వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు. అప్పుడు సమూయేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణానికి వెళ్లిపొమ్మని చెప్పాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan