1 యోహాను 5 - పవిత్ర బైబిల్దేవుని కుమారునిలో విశ్వాసము 1 యేసే క్రీస్తు అని నమ్మినవాణ్ణి దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు. 2 దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించటం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనము తెలుసుకోగలము. 3 ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు. 4 దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము. 5 యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు. దేవుడు తన కుమారుణ్ణిగూర్చి మనకు చెప్పాడు 6 యేసు క్రీస్తు నీళ్ళద్వారా, రక్తంద్వారా వచ్చాడు. ఆయన నీళ్ళద్వారా మాత్రమే రాలేదు. నీళ్ళద్వారా, రక్తంద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యవంతుడు. అందుకే ఆ ఆత్మ సాక్ష్యం చెపుతున్నాడు. 7 సాక్ష్యం చెప్పేవారు ముగ్గురున్నారు. 8 ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు. 9 మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరిస్తాము. కాని యిది దేవుని సాక్ష్యం కనుక యింకా గొప్పది. ఈ సాక్ష్యం తన కుమారుణ్ణి గురించి యిచ్చింది. 10 దేవుని కుమారుని పట్ల విశ్వాసమున్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుడు అసత్యవంతుడని నిందించినవాడౌతాడు. 11 ఆ సాక్ష్యం యిది! దేవుడు మనకు నిత్యజీవం యిచ్చాడు. ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది. 12 కుమారుణ్ణి స్వీకరించినవానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించనివానికి జీవం లభించదు. చివరి మాట 13 దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను. 14 దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది. 15 మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా! 16 మరణం కలిగించే పాపము తన సోదరుడు చెయ్యటం చూసినవాడు తన సోదరుని కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నేను చెప్పటం లేదు. 17 ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి. 18 దేవుని బిడ్డగా జన్మించినవాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించినవాణ్ణి దేవుడు కాపాడుతాడు. సాతాను అతణ్ణి తాకలేడు. 19 మనము దేవుని సంతానమని, ప్రపంచమంతా సాతాను ఆధీనంలో ఉందని మనకు తెలుసు. 20 దేవుని కుమారుడు వచ్చి నిజమైనవాడెవడో తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు తెలుసు. మనము నిజమైనవానిలో ఐక్యమై ఉన్నాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో కూడా ఐక్యమై ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్యజీవం. 21 బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International