Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

జెకర్యా 3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మరియు యెహోవాదూతయెదుట ప్రధానయాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.

2 – సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవాదూత సాతానుతో అనెను.

3 యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా

4 దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచి–ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి–నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.

5 –అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవాదూత దగ్గర నిలుచుండెను.

6 అప్పుడు యెహోవాదూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.

7 –సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా – నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనినయెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.

8 ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.

9 యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహ రింతును;

10 ఆ దినమున ద్రాక్షచెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొనిపోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan