Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

రూతు 4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు–ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.

2 బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.

3 అతడు–మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.

4 ఈ పురనివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు–నేను విడిపించెదననెను.

5 బోయజు–నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా

6 ఆ బంధువుడు– నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.

7 ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చి గాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.

8 ఆ బంధువుడు–నీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా

9 బోయజు –ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.

10 మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను.

11 అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలును–మేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;

12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.

13 కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.

14 అప్పుడు స్త్రీలు–ఈ దినమున నీకు బంధువుడులేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.

15 నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.

16 అప్పుడు నయోమి–ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.

17 ఆమె పొరుగు స్త్రీలు–నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయియొక్క తండ్రి.

18-19 పెరెసు వంశావళి యేదనగా–పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,

20 నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,

21 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan