Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

రోమా పత్రిక 6 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?

2 అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?

3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

4 కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.

5 మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము.

6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

7 చనిపోయినవాడు పాపవిముక్తు డని తీర్పుపొందియున్నాడు.

8-9 మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదు మని నమ్ముచున్నాము.

10 ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11 అటువలె మీరును పాపము విష యమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

12 కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

15 అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికినికూడదు.

16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీ రెరుగరా?

17 మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

18 పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

19 మీ శరీర బలహీనతనుబట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

20 మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

21 అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,

22 అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan