Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రకటన 22 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి

2 ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.

3 ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.

4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.

5 రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

6 మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను– ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను.

7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.

8 యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,

9 అతడు–వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

10 మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;

11 అన్యాయముచేయు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.

12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియలచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.

14 జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు.

15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

16 సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.

17 ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

18 ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;

19 ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.

20 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు–అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము.

21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుం డును గాక. ఆమేన్.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan