Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ప్రకటన 1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యుసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.

2 అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.

3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

4 యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,

5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.

6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.

8 అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

9 మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

10-11 ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము–నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.

12 ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.

13 తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.

14 ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;

15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.

16 ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.

17 నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను – భయపడకుము;

18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

19-20 కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములనుగూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan