Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతో

2 నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.

3 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.

4 ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలుకొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.

5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులలోనుండి

6 లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.

7 వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహా రార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని

8 తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధుమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను.

9 అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయవలెను.

10 నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను.

11 లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను.

12 లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి

13 అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.

14-15 అట్లు నీవు ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.

16 ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.

17 ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని.

18 ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను.

19 మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.

20 అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీయులు వారికి అట్లేచేసిరి.

21 లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

22 తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను.

23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–ఇది లేవీయులనుగూర్చిన విధి.

24 ఇరువదియైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పని చేయుటకు రావలెను.

25 అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.

26 వారు కాపాడవలసినవాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితోకూడ పరిచర్య చేయవలెనుగాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan