Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 30 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మోషే ఇశ్రాయేలీయులయొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను

2 –ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.

3-6 మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింటనుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.

7 ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీదనుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించినయెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.

8 ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.

9 విధవరాలుగాని విడనాడబడినదిగాని తనమీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.

10 ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కుకొనినయెడలనేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనినయెడలనేమి,

11 తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.

12 ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లనుగూర్చియు, ఆమె మీది ఒట్టునుగూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.

13 ప్రతి మ్రొక్కుబడిని, తన్నుతాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తనమీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచ వచ్చును, రద్దుచేయవచ్చును.

14 అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల,వాడు ఆమెమీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.

15 అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోషశిక్షను భరించును.

16 ఇవి భర్తనుగూర్చియు, భార్యనుగూర్చియు, తండ్రినిగూర్చియు, బాల్యమున తండ్రి యింటనున్న కుమార్తెనుగూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan