Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

2 –యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము.

3 మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.

4 యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;

5 అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను.

6 మరియు ఆయాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.

7 అప్పుడు ఆయాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.

8 దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.

9 మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థబలి.

10 ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.

11 ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అప విత్రుడైయుండును.

12 అతడు మూడవదినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవదినమున పవిత్రుడగును. అయితేవాడు మూడవదినమున పాపశుద్ధి చేసికొనని యెడల ఏడవదినమున పవిత్రుడుకాడు.

13 నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడలవాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుకవాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును.

14 ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములోనున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.

15 మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.

16 బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవమునైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును.

17 అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మముమీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.

18 తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునేగాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను.

19 మూడవదినమున ఏడవదినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమునవాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును.

20 అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును;వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు;వాడు అపవిత్రుడు.

21 వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరి హార జలమును ముట్టువాడు సాయంకాలమువరకు అప విత్రుడైయుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము.

22 దాని ముట్టు మనుష్యులందరు సాయంకాలమువరకు అపవిత్రులైయుందురు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan