Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను

2 – నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.

3 మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.

4 వారి పేళ్లు ఏవనగా–రూబేను గోత్రమునకు

5 జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;

6 యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;

7 ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;

8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;

9 బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;

10 జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;

11 యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;

12 దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు;

13 ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;

14 నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;

15 గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.

16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.

17 మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెను–మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో

18 దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో

19 వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,

20 దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము

21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.

22 వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులగు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.

23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టుయొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి.

24 ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.

25 వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచితిరిగి వచ్చిరి.

26 అట్లువారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.

27 వారు అతనికి తెలియపరచినదేమనగా–నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి.

28 అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితిమి.

29 అమాలేకీయులు దక్షిణదేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి.

30 కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచి–మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.

31 అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు–ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.

32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి–మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.

33 అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి; మా దృష్టికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan