Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.

2 జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను.

3 యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను.

4 వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి– మాకెవరు మాంసము పెట్టెదరు?

5 ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.

6 ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.

7 ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.

8 జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనముమీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.

9 రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.

10 జనులు తమతమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను.

11 కాగా మోషే యెహోవాతో యిట్లనెను–నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల?

12 నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.

13 ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు –తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు

14 ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచినయెడల నన్ను చంపుము.

15 నామీద నీ కటాక్షము వచ్చినయెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.

16 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.

17 నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లువారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.

18 నీవు జనులను చూచి యిట్లనుము–మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి–మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.

19 ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.

20 ఒక నెలదినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి–ఐగుప్తులోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.

21 అందుకు మోషే–నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులు–వారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.

22 వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను.

23 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను– యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.

24 మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా

25 యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరిగాని మరల ప్రవచింపలేదు.

26 ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.

27 అప్పుడు ఒక యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చి–ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా

28 మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ–మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.

29 అందుకు మోషే–నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.

30 అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి.

31 తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.

32 కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటినిపరచిరి.

33 ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.

34 మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను.

35 జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan