Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు . రెండు వెండి బూరలు చేయించుకొనుము;

2 నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.

3 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.

4 వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.

5 మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను.

6 మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.

7 సమాజమును కూర్చునప్పుడు ఊదవలెనుగాని ఆర్భాటము చేయవలదు.

8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.

9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.

10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

11 రెండవ సంవత్సరము రెండవనెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.

12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.

13 యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.

14 యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.

15 ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి.

16 జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.

17 మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.

18 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.

19 షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి.

20 గాదీయుల గోత్రసైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.

21 కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.

22 ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.

23 పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి.

24 గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

25 దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషద్దాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి

26 ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

27 ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి.

28 ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయునప్పుడు తమతమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి.

29 మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే–యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా

30 అందుకతడు–నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను.

31 అందుకు మోషే–నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు.

32 మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలుచేయుదుమనెను.

33 వారు యెహోవా కొండనుండి మూడుదినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడుదినముల ప్రయాణములో యెహోవా నిబంధనమందసము వారికి ముందుగా సాగెను.

34 వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.

35 ఆ మందసము సాగినప్పుడు మోషే–యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.

36 అది నిలిచినప్పుడు అతడు–యెహోవా, ఇశ్రాయేలు వేవేలమధ్యకు మరల రమ్మనెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan