Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నెహెమ్యా 1 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా

2 నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులనుగూర్చియు, యెరూషలేమునుగూర్చియు నేను వారి నడుగగా

3 వారు–చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందు చున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.

4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

5 ఎట్లనగా–ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,

6 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేనుచేయు ప్రార్థన అంగీ కరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.

7 నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి.

8 నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా–మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును.

9 అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.

10 చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.

11 యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan