Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమతమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా

2 యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.

3 అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను–ఇది యెహోవా చెప్పిన మాట–నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;

4 అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పినతండ్రియైన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి–మీరు సమీపించి పరిశుద్ధ స్థలము నెదుటనుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను.

5 మోషే చెప్పినట్లువారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొనిపోయిరి.

6 అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారను వారితో–మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వసమాజముమీద ఆగ్రహపడకుండునట్లును, మీరు తల విరియబోసికొనకూడదు; బట్టలను చింపుకొనకూడదు కాని, యెహోవావారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల యింటివారందరు ఏడవ వచ్చును.

7 యెహోవా అభిషేకతైలము మీమీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనుండి బయలు వెళ్ల కూడ దనెను. వారు మోషే చెప్పిన మాటచొప్పున చేసిరి.

8-9 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులును ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు.

10 మీరు ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైనదానిని, అపవిత్రమైనదానినుండి పవిత్రమైనదానిని వేరుచేయుటకును,

11 యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడ.

12 అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను– మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు.

13 కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.

14 మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు, అనగా నీవును నీతోపాటు నీ కుమారులును నీ కుమార్తెలును పవిత్రస్థలములో తినవలెను. ఏలయనగా అవి ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు.

15 హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసికొని రావలెను. నిత్యమైన కట్టడచొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను.

16 అప్పుడు మోషే పాపపరిహారార్థబలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయి యుండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి

17 –మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలిపశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధముగదా. సమాజముయొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.

18 ఇదిగో దాని రక్తమును పరిశుద్ధస్థలములోనికి తేవలెను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధస్థలములో దానిని తినవలెనని చెప్పెను.

19 అందుకు అహరోను మోషేతో–ఇదిగో నేడు పాప పరిహారార్థబలిపశువును దహనబలిద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినినయెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను.

20 మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan