Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

విలాపవాక్యములు 5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా, మాకు కలిగినశ్రమ జ్ఞాపకము చేసికొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.

2 మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను.

3 మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి.

4 ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.

5 మమ్మును తరుమువారు మా మెడలమీదికి ఎక్కియున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు.

6 పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.

7 మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.

8 దాసులు మాకు ప్రభువులైరివారి వశమునుండి మమ్మును విడిపింపగలవాడెవడును లేడు.

9 ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.

10 మహాక్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.

11 శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.

12 చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.

13 యౌవనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.

14 పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి యౌవనులు సంగీతము మానిరి.

15 సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.

16 మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.

17 దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది

18 నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.

19 యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.

20 నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?

21 యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.

22 నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan