Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అనువారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు

2 వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి.

3 యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబియోను నివాసులు వినినప్పుడు

4 వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షారసపు సిద్దెలు తీసికొని

5 పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.

6 వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి–మేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీయులతోను చెప్పగా

7 ఇశ్రాయేలీయులు–మీరు మామధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరి.

8 వారు–మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ–మీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా

9 వారు–నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చితిమి; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న

10 హెష్బోనురాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషానురాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.

11 అప్పుడు మా పెద్దలును మా దేశ నివాసులందరును మాతో–మీరు ప్రయాణముకొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో–మేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.

12 మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా యిండ్లనుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.

13 ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలిపోయెనని అతనితో చెప్పిరి.

14 ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా

15 యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి.

16 అయితే వారితో నిబంధన చేసి మూడుదినములైన తరువాత, వారు తమకు పొరుగు వారు, తమ నడుమను నివసించువారే యని తెలిసికొనిరి.

17 ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.

18 సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొఱ్ఱపెట్టిరి.

19 అందుకు సమాజ ప్రధానులందరు సర్వసమాజముతో ఇట్లనిరి–మనము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసితిమి గనుక మనము వారికి హానిచేయకూడదు.

20 మనము వారితో చేసిన ప్రమాణమువలన మనమీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమునుబట్టి వారిని బ్రదుక నియ్యవలెనని చెప్పి

21 వారిని బ్రదుకనియ్యుడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లువారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి.

22 మరియు యెహోషువ వారిని పిలిపించి యిట్లనెను–మీరు మామధ్యను నివసించువారై యుండియు–మేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి?

23 ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు.

24 అందుకు వారు యెహోషువను చూచి–నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితిమి.

25 కాబట్టి మేము నీ వశముననున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.

26 కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను.

27 అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan