Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను–భయపడకుము, జడియకుము, యుద్ధసన్నద్ధులైన వారినందరిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించుచున్నాను.

2 నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లనుంచుము.

3 యెహోషువయు యోధులందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహోషువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి

4 వారికాజ్ఞాపించినదేమనగా– ఆ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.

5 నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించెదము, వారుమునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారి పోదుము.

6 –మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయి నప్పుడు మీరు పొంచియుండుట మాని

7 లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.

8 మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాటచొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను.

9 ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.

10 ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకు ముందుగా హాయిమీదికి పోయిరి.

11 అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.

12 వారికిని హాయికినిమధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికినిమధ్యను పొంచియుండుటకు ఉంచెను.

13 వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడ మటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను.

14 హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్నవారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.

15 యెహోషువయు ఇశ్రాయేలీయులందరును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు

16 వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.

17 ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయి యుండిరి.

18 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను–నీవు చేతపట్టుకొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.

19 అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.

20 హాయివారు వెనుకవైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్నవారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.

21 పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.

22 తక్కినవారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈతట్టు కొందరు ఆతట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కు బడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.

23 వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.

24 బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి.

25 ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరు పండ్రెండు వేలమంది.

26 యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.

27 యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.

28 అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటివరకు అది అట్లే యున్నది.

29 యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడదీసెను. ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.

30 మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము

31 యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుపపనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

32 మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.

33 అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండ యెదుటను నిలువగా యెహోషువ

34 ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్లలును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా

35 యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియులేదు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan