Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 3 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరును షిత్తీమునుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి.

2 మూడుదినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి

3 –మీరు మీ దేవుడైన యెహోవా నిబంధనమందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములోనుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను.

4 మీకును దానికిని దాదాపు రెండువేల కొలమూరల యెడముండవలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లి నది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.

5 మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.

6 –మీరు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి.

7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను– నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.

8 మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధనమందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము.

9 కాబట్టి యెహోషువ–మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి

10 వారితో యిట్లనెను–సర్వలోక నాధుని నిబంధనమందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక

11 జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గిర్గాషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసికొందురు.

12 కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.

13 సర్వలోక నాధుడగు యెహోవా నిబంధనమందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.

14 కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధనమందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.

15 అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచునమునగగానే

16 పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను.

17 జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan