Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోహాను 16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను.

2 వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలమువచ్చుచున్నది.

3 వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు.

4 అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతోకూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.

5 ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను –నీవు ఎక్కడికి వెళ్లు చున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని

6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది.

7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.

8 ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.

9-11 లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.

12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు.

13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.

14 ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.

15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.

16 కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.

17 కాబట్టి ఆయన శిష్యులలో కొందరు–కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పుకొనిరి.

18 –కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి.

19 వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను–కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా?

20 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

21 స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.

22 అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.

23 ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24 ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.

26 ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.

27 మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.

28 నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.

29 ఆయన శిష్యులు–ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.

30 సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా

31 యేసు వారిని చూచి–మీరిప్పుడు నమ్ము చున్నారా?

32 యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.

33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan