యోహాను 14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని .యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. 2 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. 3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును. 4 నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. 5 అందుకు తోమా– ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా 6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. 7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. 8 అప్పుడు ఫిలిప్పు–ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా 9 యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? 10 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు. 11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 12 నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేనుచేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 13 మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును. 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 15 మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు. 16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. 17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును. 18 మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; 19 అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. 20 నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. 21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను. 22 ఇస్కరియోతు కాని యూదా– ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా 23 యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము. 24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. 25 నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. 26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. 27 శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. 28 నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లు చున్నానని మీరు సంతోషింతురు. 29 ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. 30 ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు. 31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India