యిర్మీయా 47 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు 2 –యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లుగాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించువారిమీదను ప్రవహించును. 3 వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లలతట్టు తిరిగి చూడరు. 4 ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును, 5 గాజా బోడియాయెను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? 6 యెహోవా ఖడ్గమా, యెంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్ర మించి ఊరకుండుము. 7 అష్కెలోనుమీదికిని సముద్ర తీరముమీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? –అచ్చ టికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India