Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 44 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసముచేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.

3 మీరైనను మీపితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.

4 మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని

5 వారు ఆలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.

6 కావున నా ఉగ్రతయు నాకోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.

7 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటిబిడ్డలును యూదా మధ్యనుండకుండ నిర్మూలముచేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?

8 మీకు మీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్క రింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?

9 వారు యూదాదేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీపితరులు చేసిన చెడుతనమును యూదారాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా?

10 నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీపితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.

11-12 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు కీడుచేయునట్లు, అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించు కొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందినవారుగాను ఉందురు.

13 యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.

14 కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.

15-16 అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహా సమాజముగా కూడినవారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి–యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,

17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

18 మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.

19 మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా

20 యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను

21 యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీపితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.

22 యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరుచేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను.

23 యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను.

24 మరియు యిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను–ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.

25 ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు – ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.

26 కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాటవినుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా –ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణముచేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయుచున్నాను.

27 మేలుచేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.

28 ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములోనుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పుడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.

29 మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.

30 అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan