Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 41 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పదిమంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.

2 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితోకూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి.

3 మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.

4 అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడకమునుపు

5 గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనినయెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహునుండియు షోమ్రోనునుండియు రాగా

6 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో–అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను.

7 అయితే వారు ఆ పట్టణముమధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి.

8 అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో–పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతోకూడ వారిని చంపక మానెను.

9 ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలురాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.

10 అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్ష కుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా

11 కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములనుగూర్చిన వార్త విని

12 పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి.

13 ఇష్మాయేలుతోకూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితోకూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి

14 ఇష్మాయేలు మిస్పాలోనుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి.

15 అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి.

16-18 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత, కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనల యధిపతులందరును మిస్పాదగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలుకొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి; అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందునవారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan