Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 39 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యూదారాజైన సిద్కియా యేలుబడియందు . తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చి దాని ముట్టడివేయగా

2 సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవదినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.

3 యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సమ్గర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.

4 యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడలమధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.

5 అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి

6 బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.

7 అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.

8 కల్దీయులు రాజనగరును ప్రజలయిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.

9 అప్పుడు రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.

10 అయితే రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.

11-12 మరియు యిర్మీయానుగూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను–నీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను.

13 కావున రాజదేహసంరక్షకులకు అధిపతియైన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నేర్గల్‌షరే జరును బబులోనురాజు ప్రధానులందరును దూతలను పంపి

14 బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను.

15 యిర్మీయా బందీగృహశాలలోనుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

16 –నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మేలుచేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును.

17 ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

18 నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదే యెహోవా వాక్కు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan