Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 19 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–

2 నీవు వెళ్లి కుమ్మరిచేయు మంటి కూజానుకొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.

3 నీ విట్లనుము –యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి; సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలకించుడి, దాని సమాచారము వినువారందరికి చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవుచున్నాను.

4 ఏలయనగా వారు నన్ను విసర్జించి యీ స్థలములో అపచారము చేసియున్నారు, వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తముచేత ఈ స్థలమును నింపిరి

5 నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.

6 ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా–రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్‍హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.

7 తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములను తీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.

8 ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అప హాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.

9 వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడినిబట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.

10 ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను

11 –సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మరల బాగుచేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను; తోఫెతులో పాతిపెట్టుటకు స్థలములేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు.

12 యెహోవా వాక్కు ఇదే–ఈ పట్టణమును తోఫెతువంటి స్థలముగా నేను చేయుదును, ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును.

13 యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులును ఆ తోఫెతు స్థలమువలెనే అపవిత్రములగును; ఏ యిండ్లమీద జనులు ఆకాశసమూహమను దేవతలకు ధూపము వేయుదురో, లేక అన్యదేవతలకు పానార్పణములనర్పించుదురో ఆ యిండ్లన్నిటికి ఆలాగే జరుగును.

14 ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.

15 –సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఈ జనులు నా మాటలు వినకుండ మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమునుగూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటిమీదికిని రప్పించుచున్నాను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan