Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 15 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను– మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.

2 మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–చావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.

3 యెహోవా వాక్కు ఇదే–చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.

4 యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకలరాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.

5 యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీయందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవవిడిచి నీయొద్దకు వచ్చును?

6 యెహోవా వాక్కు ఇదే–నీవు నన్ను విసర్జించియున్నావు వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింప జేయునట్లు నేను నీ మీదికి నాచేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను.

7 దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయు చున్నాను.

8 వారి విధవరాండ్రు సముద్రపు ఇసుకకంటె విస్తారముగా ఉందురు; మధ్యాహ్నకాలమున యౌవనుల తల్లిమీదికి దోచుకొనువారిని నేను రప్పింతును; పరితాపమును భయములను ఆకస్మాత్తుగా వారిమీదికి రాజేతును.

9 ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది; ఆమె ప్రాణము విడిచియున్నది; పగటివేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి యున్నది. ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది; వారిలో శేషించిన వారిని తమ శత్రువులయెదుట కత్తి పాలు చేసెదను; ఇదే యెహోవా వాక్కు.

10 అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదు లిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించుచున్నారు.

11 అందుకు యెహోవా–నిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను.

12 ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుమునైనను కంచునైనను ఎవడైన విరువగలడా?

13 నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరుచేయు సమస్త పాపములనుబట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.

14 నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును.

15 యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతి దండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము.

16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.

17 సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.

18 నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా?

19 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపెట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారితట్టునకు తిరుగకూడదు

20 అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

21 దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమో చించెదను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan