Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 13 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకుము.

2 కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.

3 రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై

4 –నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా

5 యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.

6 అనేక దినములైన తరువాత యెహోవా– నీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచి పెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసికొనుమని నాతో చెప్పగా

7 నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.

8 కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

9 –యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును.

10 అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగుదురు.

11 నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

12 కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడును. –ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనినయెడల

13 నీవు వారితో ఈ మాట చెప్పుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ దేశనివాసుల నందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.

14 అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.

15 చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.

16 ఆయన చీకటి కమ్మజేయకమునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.

17 అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.

18 రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము–మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.

19 దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్ట బడిరి; ఏమియులేకుండ సమస్తము కొనిపోబడెను.

20 కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది?

21 నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీద అధిపతులుగా నియమించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా?

22 నీవు–ఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను.

23 కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.

24 కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.

25 నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

26 కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.

27 నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan