యిర్మీయా 12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల? 2 నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల నిచ్చుచున్నారు; వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. 3 యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచుచున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱెలవలెను వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము. 4 భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి. 5 –నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు? 6 నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. 7 నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను; నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువులచేతికి అప్పగించియున్నాను. 8 నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహమువంటిదాయెను; ఆమె నామీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. 9 నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగు చేయుడి; మ్రింగివేయుటకై అవి రావలెను. 10 కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు. 11 వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను. 12 పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు. 13 జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు. 14 నేను నాజనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారినిగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను వారి దేశములోనుండి వారిని పెల్లగింతును; మరియు వారి మధ్యనుండి యూదావారిని పెల్లగింతును. 15 వారిని పెల్లగించిన తరువాత నేను మరల వారియెడల జాలిపడుదును; ఒక్కొకని తన స్వాస్థ్యమునకును ఒక్కొకని తన దేశమునకును వారిని రప్పింతును. 16 బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామమునుబట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజలమార్గములను జాగ్రత్తగా నేర్చుకొనినయెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు. 17 అయితే వారు నా మాట విననొల్లని యెడల నేను ఆ జనమును వేరుతో పెల్లగించి బొత్తిగా నాశనము చేతును; ఇదే యెహోవా వాక్కు. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India